Share News

కస్టం మిల్లింగ్‌ అక్రమార్కులపై దర్యాప్తు కొనసాగాల్సిందే!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:34 AM

కస్టం మిల్లింగ్‌ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని.. వారి మీద నమోదైన క్రిమినల్‌ కేసులు కొట్టేస్తే ప్రజాధనానికి నష్టం వాటిల్లుతుందని స్టేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు హైకోర్టుకు...

కస్టం మిల్లింగ్‌ అక్రమార్కులపై దర్యాప్తు కొనసాగాల్సిందే!

  • కేసులు కొట్టేస్తే ప్రజాధనానికి తీవ్ర నష్టం

  • ఒక్కొక్కరి నుంచి రూ.50-100 కోట్లు రావాలి

  • ఆ సొమ్మును మిల్లర్లు స్థిరాస్తి, సినిమా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు

  • హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది వాదనలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): కస్టం మిల్లింగ్‌ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని.. వారి మీద నమోదైన క్రిమినల్‌ కేసులు కొట్టేస్తే ప్రజాధనానికి నష్టం వాటిల్లుతుందని స్టేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు హైకోర్టుకు తెలియజేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాం నుంచి కస్టం మిల్లింగ్‌ రైస్‌ ఇవ్వకుండా రూ.కోట్ల మేర ఎగవేసిన రైస్‌మిల్లర్లపై ప్రభుత్వం గతంలో క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించింది. తమపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందని, వాటిని కొట్టేయాలని కోరుతూ 53 మంది రైస్‌ మిల్లర్ల యజమానులు హైకోర్టులో విడివిడిగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పోలీసు విభాగం తరఫున స్టేట్‌ పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్‌ బియ్యాన్ని పక్క దారి పట్టించడం ద్వారా ఈ రైస్‌మిల్లర్లు భారీగా సొమ్ము చేసుకున్నారని, ఆ సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. సోమగాని నర్సయ్య అనే రైస్‌మిల్లర్‌ ఏకంగా ఓ సినిమానే నిర్మించారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మిల్లర్లలో 10 నుంచి 15 శాతం మంది డీఫాల్టర్లు ఉన్నారని.. ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. కొంతమంది మిల్లర్లు 2016 నుంచి ఇప్పటి వరకు వడ్లు తీసుకుని కస్టం మిల్లింగ్‌ బియ్యం ఇవ్వకుండా బకాయిలు పెట్టారని పేర్కొన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. దర్యాప్తు పూర్తయితేనే ఎవరెవరు ఎంత బకాయి పడ్డారన్న వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Updated Date - Apr 16 , 2026 | 04:35 AM