Share News

డేటా సెంటర్లపై ప్రతిపాదనలు ఇవ్వండి: సీఎస్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:39 AM

రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

డేటా సెంటర్లపై ప్రతిపాదనలు ఇవ్వండి: సీఎస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుపై సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమాశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు డేటా కేంద్రాలకు ఇస్తున్న రాయితీలను పరిశీలించి, వాటికంటే మెరుగైన సదుపాయాలు కల్పించాలని సీఎస్‌ సూచించారు. పెట్టుబడిదారులు కోరుతున్న విధంగా 100 శాతం విద్యుత్తు సౌకర్యం, అలాగే బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసుకునే వెసులుబాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఐటీ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందడమే కాకుండా, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎస్‌ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్‌, మల్కాజిగిరి మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అధికారులు చేపడుతున్న పారిశుధ్య పనుల వివరాలను ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డ్‌లో పొందుపర్చాలన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో మునిసిపల్‌ విభాగం అత్యంత కీలకమని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Feb 19 , 2026 | 04:39 AM