Share News

మార్పిడి అత్యవసరం

ABN , Publish Date - May 06 , 2026 | 05:49 AM

తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ.. కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

మార్పిడి అత్యవసరం

  • వరి పెరుగుతోంది.. కూరగాయల సాగు తగ్గుతోంది..

  • 2014 తర్వాత వ్యవసాయం గాడి తప్పింది.. దారిలో పెట్టాలి

  • ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్యాక్‌ హౌస్‌లు, కోల్డ్‌ స్టోరేజీలు కావాలి

  • కూరగాయల క్లస్టర్‌ పెట్టాలి.. దళారీలను నియంత్రించాలి

  • పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలకూ ‘మద్దతు’ ఉండాలి

  • పంటల మార్పిడి నివేదికలో రైతు కమిషన్‌ సిఫార్సులు

  • పంటల మార్పిడిపై అసెంబ్లీలో చర్చ పెడదాం

  • నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి: కమిషన్‌ బృందంతో సీఎం

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ.. కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్‌ ఆహార భద్రత కోసం రాష్ట్రంలో పంటల మార్పిడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. వాతావరణ జోన్ల ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించాలని.. పంటల మార్పిడి లక్ష్యాలను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సంవత్సరాల వారీగా, గ్రామాల వారీగా నిర్ణయించాలని కమిషన్‌ సూచించింది. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ సమస్య ప్రధానంగా ఉందని పేర్కొంది. కేరళ తరహాలో రాష్ట్రంలో కూరగాయల క్లస్టర్‌ను, నాసిక్‌లోని సహ్యద్రి ఫార్మ్స్‌ తరహాలో ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్రంలో పంటల మార్పిడి అంశంపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికను మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది. మొత్తం 40 పేజీల నివేదికలో ఉద్యాన, సాంప్రదాయ, ఇతర ముఖ్య పంటల వివరాలను, ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనం వివరాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను వివరంగా పేర్కొంది. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) నిర్ణయించాలని.. ఇందుకోసం రైతులు సభ్యులుగా ఉండే ప్రత్యేక ధరల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరింది. రాష్ట్రంలో మార్కెట్లను సందర్శించినప్పుడు దళారీ వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉన్నట్టుగా గుర్తించామని, దాన్ని నియంత్రించాలని సూచించింది.


ప్రస్తుత పరిస్థితి.. గుర్తించిన సమస్యలివీ..

రైతు కమిషన్‌ నివేదికలో పేర్కొన్న ప్రకారం.. తెలంగాణలో 2013-14లో 35.38 లక్షల ఎకరాల్లో వరి సాగయితే.. 2024-25 నాటికి సుమారు 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. అదే సమయంలో కూరగాయల సాగు 5.45 లక్షల ఎకరాల నుంచి 1.02 లక్షల ఎకరాలకు తగ్గింది. రాష్ట్రంలో పసుపు సాగు 1,52,445 ఎకరాల నుంచి 42,246 ఎకరాలకు, చెరుకు 95,348 ఎకరాల నుంచి 51,482 ఎకరాలకు పడిపోయాయి. కనీస మద్దతు ధర, ప్రభుత్వ సేకరణపై ఆధారపడి పత్తి, వరి పంటల సాగు పెరిగింది. ఇలా ఒకే రకమైన పంటల సాగుతో నేల సారం దెబ్బతిన్నది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్‌, ఎగుమతుల సదుపాయాలు లేకపోవడం, విత్తనాల లభ్యత లేకపోవడంతో సాగు తగ్గింది. ఇక కోతులు, అడవి పందులు, జింకల వంటి వన్యప్రాణుల బెడద కూడా కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గడానికి కొంత ప్రభావం చూపిందని రైతు కమిషన్‌ నివేదికలో పేర్కొంది.


2014 తర్వాత గాడితప్పిన వ్యవసాయం

తెలంగాణలో 2014 తర్వాత వ్యవసాయం గాడి తప్పిందని, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని రైతు కమిషన్‌ నివేదికలో పేర్కొంది. వరి, పత్తి కొనుగోలు విషయంలో భవిష్యత్‌లో కేంద్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పసుపు, చెరుకు వంటివాటి విస్తీర్ణం పెంచితే ప్రయోజనం ఉంటుందని సూచించింది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ఉండాలని సూచించింది. పంటల బీమా, రుణ సౌకర్యాలను వరి, పత్తితో పాటు ఇతర ముఖ్యమైన పంటలకు కూడా అమలు చేయాలని పేర్కొంది. రాష్ట్ర జనాభాకు అవసరమైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అవసరమని రైతు కమిషన్‌ పేర్కొంది. రైతులకు కూరగాయల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్‌ ఇరిగేషన్‌, మల్చింగ్‌, కూరగాయల పందిళ్ల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహాకాలు ఇవ్వాలని సూచించింది. వివిధ జిల్లాల్లో సాగవుతున్న పంటలకు ప్రాసెసింగ్‌ సదుపాయాలు, ప్యాక్‌ హౌస్‌లు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉద్యాన పంటల కొనుగోళ్ల కోసం ప్రత్యేక మార్కెటింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కూరగాయల విత్తనోత్పత్తి కీలకమని, రాష్ట్రంలోనే విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. కోతులు, వన్యప్రాణుల బెడదను అధిగమించడానికి నాబార్డు సహకారంతో సోలార్‌ ఫెన్సింగ్‌పై రాయితీ ఇవ్వాలని సూచించింది.


పంటల మార్పిడిపైఅసెంబ్లీలో చర్చ పెడదాం: సీఎం

రాష్ట్రంలో పంటల మార్పిడి అంశంపై సమగ్ర చర్చ జరపాలని భావిస్తున్నామని.. దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర రైతు కమిషన్‌ చైౖర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు కలిశారు. పంటల మార్పిడిపై రూపొందించిన నివేదికను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి, నిర్మాణాత్మక సూచనలతో రావాలని రైతు కమిషన్‌కు సూచించారు.

Updated Date - May 06 , 2026 | 05:50 AM