Share News

వరి బదులు కందులు

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:49 AM

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో.. వరి పంటను వీలైనంత తగ్గించాలని, ఈనెల 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలు నాటొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది.

వరి బదులు కందులు

  • చిరు ధాన్యాలు, నూనె గింజలు కూడా

  • ప్రత్యామ్నాయ పంటలపై తొలిదశ కార్యాచరణ

  • సూచించిన సర్కారు అంతర పంటలకు ప్రాధాన్యం

  • జోన్లు, జిల్లాలవారీగా సిఫారసులు

  • 20 తర్వాత పత్తి విత్తనాలు వేయొద్దని హెచ్చరిక

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌ పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో.. వరి పంటను వీలైనంత తగ్గించాలని, ఈనెల 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలు నాటొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. రాష్ట్రంలో జోన్లు, జిల్లాలవారీగా పంటల సాగుకు ప్రత్యేక సిఫార్సులు చేసింది. ప్రత్యామ్నాయ పంటలతోపాటు అంతర పంటల సాగుకు పెద్దపీట వేసింది. వరి బదులు కందులు, చిరుధాన్యాలు, నూనెగింజలు సాగు చేయాలని సూచించింది. ఎల్‌నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటి దశ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. వర్షాలు ఆలస్యంగా పడినా, మధ్యలో విరామాలు వచ్చినా, వర్షాకాలం ముందుగానే ముగిసినా రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ప్రకటించారు.


కూరగాయల సాగు బెస్టు

వరి బదులు కంది, సజ్జ, కొర్రలు, రాగులు, పెసర్లు, మినుములు, పొద్దుతిరుగుడు, ఆముదం, జొన్న, తక్కువ కాలంలో దిగుబడి వచ్చే కూరగాయల పంటలు సాగు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో.. నీరు అధికంగా అవసరమయ్యే వరి సాగును తగ్గించాలని హితవు పలికారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వర్షాలు ఆలస్యంగా వస్తే.. కంది; సజ్జలు- కంది అంతర పంట; కొర్రలు- కంది అంతర పంటగా సాగు చేయాలని సూచించింది. మధ్య తెలంగాణ జిల్లాలైన మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కంది, సజ్జలు, పొద్దుతిరుగుడు, రాగులు, జొన్నలు, కూరగాయలు సాగు చేయాలని సూచించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నారాయణపేట జిల్లాల్లో ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, సజ్జలు, కొర్రలు, కూరగాయలు సాగు చేయాలని సూచించింది. ఆదాయం తగ్గకుండా ఉండేందుకు పలు అంతర పంటల విధానాలను సిఫార్సు చేసింది. సజ్జలు, కందులను 2:1 లేదా 4:1 నిష్పత్తిలో, కొర్రలు- కందులను 4:1 నిష్పత్తిలో, ఆముదం, కంది పంటలను 2:1 నిష్పత్తిలో సాగు చేయాలని, ఈ విధానం ద్వారా తేమ సంరక్షణతోపాటు రైతులకు కనీస ఆదాయం లభించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.


పత్తి విస్తీర్ణాన్ని పెంచొద్దు

మరో మూడు రోజులు దాటితే (జూలై 20 తేదీ తర్వాత) పత్తి విత్తనాలు నాటొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పత్తి విస్తీర్ణాన్ని పెంచకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని తెలిపింది. ఇక పత్తి సాగు శ్రేయస్కరం కాదని, జూన్‌ ఒకటో తేదీ నుంచి మొదలుకొని ఏడు వారాల్లోపే పత్తి సాగు చేయాలని, లేకపోతే దిగుబడి రాదని, పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Updated Date - Jul 17 , 2026 | 05:50 AM