నేరాల లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చెయ్యాలి
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:57 AM
నేరానికి కారణాలు, నేరస్థులు అనుసరించిన విధానం, దర్యాప్తు తీరును ఉన్నతాధికారులు సమీక్షిస్తుండాలని డీజీపీ ఆనంద్ సూచించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అర్ధవార్షిక నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
మూడేళ్లలో క్రైమ్ పెరుగుదల 7.15 శాతం
పెరిగిన డ్రగ్స్, వ్యవస్థీకృత, సాధారణ నేరాలు
అర్ధవార్షిక సమీక్షలో డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): నేరానికి కారణాలు, నేరస్థులు అనుసరించిన విధానం, దర్యాప్తు తీరును ఉన్నతాధికారులు సమీక్షిస్తుండాలని డీజీపీ ఆనంద్ సూచించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అర్ధవార్షిక నేరసమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆనంద్ మాట్లాడుతూ ప్రతి యూనిట్ ఆఫీసర్ నెలవారీ నేరాల సమీక్షను ప్రాధాన్యాంశాల్లో ఒకటిగా చేపట్టాలని ఆదేశించారు. కొంతకాలంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎ్‌స) ప్రాజెక్టుపై నిరంతరం దృష్టి సారించడంతో గతంలో 70-80శాతం ఉన్న డేటా అప్‌డేట్ ప్రస్తుతం 96 శాతానికి చేరడం అభినందనీయమన్నారు. గత మూడేళ్లలో నేరాల సంఖ్య 7.15 శాతం పెరిగిందన్నారు. 2023-24 లో డ్రగ్స్ కేసులు 2,026 నమోదు కాగా, 2025-26లో ఈ సంఖ్య 2,960కి చేరుకుందని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేర ముఠాలను వ్యవస్థీకృతమైనవిగా గుర్తించి కేసులు నమోదు చేస్తుండటంతో.. గతంలో 25 వ్యవస్థీకృత నేరాలు నమోదు కాగా, ప్రస్తుతం 451 నమోదయ్యాయని... కేసుల సంఖ్య పెరిగినా అనేక ముఠాలను జైలుకు పంపగలిగామన్నారు. ట్రాఫిక్ నేరాలు 29,130 నుంచి 31,891కి (9.48శాతం) పెరిగాయని, సైబర్ 25,373 నుంచి 22వేలకు(13.29ు), ఆర్థికనేరాలు 37,690నుంచి 32,684కు (13.28శాతం) తగ్గాయని డీజీపీ వివరించారు. తీవ్రమైన నేరాలు (గ్రేవ్ క్రైమ్స్) 7,019 నుంచి 6,294కు (10.33శాతం) తగ్గాయని, లక్ష జనాభాకు నేరాలరేటు 11.21నుంచి 10.88 కు తగ్గిందని, హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు, సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కి తగ్గాయని, అయితే గ్రేవ్ క్రైమ్స్ ములుగు, నిర్మల్, ఆదిలాబాద్‌లలో ఎక్కువగా పెరగడంపై దృష్టి సారించాలన్నారు. సాధారణ నేరాల్లో మూడేళ్లలో 7.28 శాతం వృద్ధి కనిపిస్తోందని, ఆదిలాబాద్‌లో 60.71 శాతం పెరుగుదల ఉందన్నారు. నార్కోటిక్స్ నేరాల్లో లక్ష జనాభా రేటును పరిశీలిస్తే 3.68 నుంచి 5.12 శాతం పెరుగుదల నమోదైందని, సైబరాబాద్ కమిషనరేట్‌లో 90శాతం కనిపిస్తోందన్నారు. శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేష్ భగవత్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, సీఐడీ చీఫ్ చారుసిన్హా, ఈగల్ డెరెక్టర్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.