సివిల్ కోర్టులో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ
ABN , Publish Date - May 07 , 2026 | 05:19 AM
అంగన్‌వాడీ సిబ్బందికి పోషణ్ అభియాన్ కింద అందించిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో రూ.30 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ ...
మంత్రి సీతక్క వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి ఆరోపణల సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఉత్తర్వులు
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ సిబ్బందికి పోషణ్ అభియాన్ కింద అందించిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో రూ.30 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వేసిన పరువు నష్టం దావాలో బీఆర్‌ఎ్‌సకు ఎదురుదెబ్బ తగిలింది. సీతక్క పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అదనపు న్యాయమూర్తి పి.లక్ష్మీకుమారి తక్షణమే ఆ పోస్టులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చారు. అంగన్‌వాడీ సిబ్బంది కోసం ఒక్కో మొబైల్‌ను రూ.11,650 చొప్పన మొత్తం రూ.44.42 కోట్ల విలువ గల ఫోన్లు పూర్తి పారదర్శకంగా టెండర్లలో తక్కువ బిడ్ చేసిన వారికి కాంట్రాక్టు ఇచ్చినట్టు సీతక్క తరఫు న్యాయవాది కృష్ణకుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం ఇందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని అవాస్తవ పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీతక్క ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నందున ఆ నిరాధార పోస్టులను తక్షణమే తొలగించడం తో పాటు మరోసారి ఈ విధమైన ప్రచారం చేయకుండా ఆదేశించాలని న్యాయవాది కోరారు. టెండర్ ప్రక్రియను పూర్తిగా పరిశీలించిన న్యాయస్థానం తక్షణమే ఈ పోస్టులను తొలగించాలని ఆదేశించడంతో పాటు ప్రతివాదులకు ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల 6వ తేదీకి కేసును వాయిదా వేసింది. కాగా బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారంపై సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు.