ప్రత్యామ్నాయ పంటలకు బోనస్?
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:20 AM
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా... పప్పు ధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగు గణనీయంగా పడిపోతోంది.
స్వచ్ఛందంగా పంట మార్పిడిచేసే రైతులకు ప్రోత్సాహం
ఎకరానికి రూ.4-5 వేలు చెల్లించాలనే ప్రతిపాదనలు
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలకు సై
నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయలకు కూడా
అసాధారణంగా పెరిగిన వరిసాగును తగ్గించడమే లక్ష్యం
సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రతిపాదనలు
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అలాంటి భూముల గుర్తింపు!
తద్వారా మిగిలే సొమ్మును పంటల బోనస్,పంటల బీమా వంటి పథకాలకు వినియోగించే యోచన
వీబీజీరామ్‌జీ అమలు, ఎస్‌బీఐక్యాప్స్ తదితర కీలక అంశాలపై నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా... పప్పు ధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో.. వరిని అవసరం మేరకు ఉత్పత్తి చేసుకుని, దిగుమతి చేసుకుంటున్న ఇతర ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం (జూలై 2) జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సాగునీటి లభ్యత, ప్రాజెక్టులు, చెరువులు అందుబాటులో ఉండటం.. ఫామ్‌గేట్ వద్దే (కల్లంలోనే) ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తుండడం, నేరుగా రైతు ఖాతాల్లోకే కనీస మద్దతు ధర జమ చేయడం, ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లిస్తుండడంతో.. ప్రస్తుతం రైతులు వరి సాగుకే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రైతులను ఇతర పంటల సాగు వైపు మళ్లించడానికి, ప్రత్యామ్నాయ పంటలసాగును ప్రోత్సహించడానికి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగులో స్వయంసమృద్ధి సాధించడానికి ఎకరానికి ఎంతో కొంత ‘బోనస్’ ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. రైతు భరోసాను కొనసాగిస్తూనే.. స్వచ్ఛందంగా పంటల మార్పిడి చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ బోనస్ ఇవ్వాలని, పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్నలు తదితర ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే నూనెగింజల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచితే విదేశాల నుంచి వంట నూనెల దిగుమతి తగ్గుతుందనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పామాయుల్ సాగుకు ఆర్థికంగా ప్రోత్సాహం ఇస్తున్నాయి. అదే క్రమంలో వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు.. తదితర పంటల సాగును కూడా పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆయా పంటలకు రూ.నాలుగైదు వేల పోత్సాహకం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వచ్చిన సిఫారసులపై క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.
సాగు భూములకే..
రైతుభరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి.. తద్వారా మిగిలిన నిధులను పంటల బోనస్, పంటల బీమా పథకాలకు మళ్లించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది నుంచి శాటిలైట్ మ్యాపింగ్ చేసి, ఎవరు పంటలు వేశారు? ఏ పంటలు వేశారనే వివరాలు సేకరించి.. కేవలం సాగుచేసిన భూములకు మాత్రమే రైతుభరోసా చెల్లించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు ఉన్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని.. తద్వారా రూ.2-3 వేల కోట్లు మిగిలినా ఆ సొమ్మును పంటల బోనస్, పంటల బీమా లాంటి పథకాలకు వినియోగించాలని భావిస్తున్నట్టు సమాచారం.
వీబీజీరామ్‌జీ అమలుపై..
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతామ్నాయ పంటలకు బోనస్ తదితర అంశాలతోపాటు.. బుధవారం ప్రారంభమైన ‘వీబీజీరామ్‌జీ’ కార్యక్రమం అమలుపైనా చర్చించనున్నారు. వీబీజీరామ్‌జీ నిర్వహణకు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలు.. రాష్ట్రం వాటా 40శాతం చెల్లింపు, ఇతర అంశాలపై చర్చించి ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తనవాటా కింద వీబీజీరాంజీ నిధుల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. అయితే.. కొత్త చట్టం ప్రకారం వీబీజీరామ్‌జీని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ భేటీలో చర్చించనున్నారు. అదే సమయంలో.. ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకూ వందశాతం నిధులు కేంద్రమే భరించాలని, కొత్త పథకం అమలును కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరిన విషయంపై కూడా మంత్రి వర్గం చర్చించే అవకాశాలున్నాయి.
మరో అంశంగా ఎస్‌బీఐ క్యాప్స్..
మెట్రో మొదటి దశ విలువను తిరిగి లెక్కించడానికి, రెండో దశ విస్తరణకు అవసరమయ్యే మొత్తం రుణ సేకరణకు కన్సల్టెన్సీ సంస్థగా కేంద్ర ప్రభుత్వం ‘ఎస్‌బీఐ క్యాప్స్’ను నియమించిన విషయం విదితమే! రెండు దశలకూ కలిపి ఎంత రుణం కావాలి? ఏ సంస్థల నుంచి సేకరించాలి? ఎంత వడ్డీ చెల్లించాలి? ఎన్నేళ్ల కాలానికి రుణం తీసుకోవాలి? అనే అంశాలపై ‘ఎస్‌బీఐ క్యాప్స్’ అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణ సేకరణ చర్యలు చేపడతాయి. దీనిపైనా క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి.
