అప్పులు, టెండర్లపై హైడ్రామా
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:51 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. గురుకుల టెండర్లపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమంటూ..
గన్ పార్కు, తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడి
గురుకుల టెండర్లపై చర్చకు గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్
బీఆర్‌ఎస్ నేతల కోసం ఎదురుచూపు
మంత్రులతో చర్చకు వెళుతుండగా హరీశ్ అరెస్టు
మంత్రులకు హరీశ్ ఫోన్.. లిఫ్ట్ చేయని వైనం
జూపల్లి కోసం టీ-భవన్‌లో కేటీఆర్ నిరీక్షణ
అప్పుల లెక్కలతో గన్ పార్కు వద్దకు మంత్రి
కేసీఆర్‌కు అద్దంకి దయాకర్ ఫోన్.. నో రెస్పాన్స్
హైదరాబాద్, జూలై 2(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. గురుకుల టెండర్లపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు. మరోవైపు మంత్రులతో చర్చకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు బయలుదేరారు. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకోగా.. నడిచి వెళతానంటూ కిందకు దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా హరీశ్‌రావు కింద పడిపోయారు. అదే సమయంలో పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చ కోసం తెలంగాణ భవన్‌లో ఆయనకు ఒక కుర్చీ వేసి మరీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెడీ అయ్యారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, దీనిపై తెలంగాణ భవన్‌కు వచ్చి చర్చించేందుకు సిద్ధమని జూపల్లి ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్ సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ నేతల కోసం గన్ పార్కు వద్ద మంత్రుల ఎదురుచూపు.. అక్కడకు వెళ్లేందుకు హరీశ్‌రావు ప్రయత్నాలతో హైడ్రామా నడిచింది. ఇరువైపులా ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలూ పెద్దఎత్తున మోహరించి ఉండటంతో శాంతిభద్రతల పరిరక్షణకు హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిప్పి కంచన్‌బాగ్ స్టేషన్‌కు తరలించారు. చాలాసేపు ఎదురుచూసిన మంత్రులు తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. చర్చకు రమ్మని పిలిచి అరెస్టు చేయించడం ఏంటని ప్రశ్నించేందుకు హరీశ్‌రావు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్‌లకు ఫోన్ చేశారు. వారు ఫోన్లు లిఫ్ట్ చేయలేదంటూ స్ర్కీన్ షాట్‌ను మీడియాకు చూపించారు. దీనికి కౌంటర్‌గా మరోవైపు.. మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మీడియా సాక్షిగా ఏకంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. దయాకర్ కాల్‌కు స్పందన రాలేదు. పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ వెళ్లి పోయాక.. బీఆర్‌ఎస్ హయాంలో అప్పులపై చర్చకు మంత్రి జూపల్లి కృష్ణారావు గన్ పార్కు వద్దకు చేరుకున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అప్పులపై గన్ పార్కు వద్ద చర్చిద్దామని హరీశ్‌రావు సవాల్ విసిరిన నేపథ్యంలో జూపల్లి వచ్చారు. కేటీఆర్‌ను కూడా గన్ పార్కుకే రావాలని సూచించారు. దాంతో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్‌ను శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకున్నారు.
ఆధారాలతో నిరూపించండి: పొన్నం
గురుకుల టెండర్లలో అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్‌ను స్వీకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్‌లు.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్‌ఎస్ మాజీ మంత్రులతో మాత్రమే చర్చిస్తామంటూ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రులు గురువారం సీఎల్పీ కార్యాలయం నుంచి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. గురుకులాల టెండర్లపై హరీశ్‌రావు, కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని పొన్నం డిమాండ్ చేశారు. ‘గురుకుల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి అని ఒకసారి, రూ.3 వేల కోట్ల అవినీతి అని మరోసారి ఆరోపణలు చేశారు. మొత్తం కొనుగోలు ప్రక్రియే రూ.1,143 కోట్లుంటే.. ఇందులో రూ.2 వేల కోట్లు, రూ.3 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంద’ని ప్రశ్నించారు. గురుకులాలకు కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ పనిచేసిన పదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ముగ్గురు మంత్రులం లేఖ రాయనున్నట్లు తెలిపారు. గురుకుల టెండర్లను మఫత్‌లాల్ దక్కించుకోవడాన్ని బీఆర్‌ఎస్ నేతలు తప్పు పడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు మఫత్‌లాల్ దుస్తులు ధరించవద్దా అని నిలదీశారు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగినట్లు ఆధారాలు చూపిస్తే తాము ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తామన్నారు. తాము అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చినందునే స్పందించలేదని హరీశ్ ఆరోపణకు బదులిచ్చారు. గురుకుల టెండర్లతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ఆధారాలతో రావాలని అడ్లూరి సూచించారు.
ఆర్థిక భారం 8.21 లక్షల కోట్లు: జూపల్లి
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన ముగిసే సరికి రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి చెప్పారు. ఆ లెక్కలూ వివరించిన ఆయన.. అవి తప్పని కేసీఆర్‌తో చెప్పించాలన్నారు. తన లెక్క తప్పని తేలితే రాజీనామాకు సిద్ధమనే మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన వద్ద ఉన్న రికార్డులు, కాగితాలు ఇస్తానని, కేటీఆర్, హరీశ్ చర్చకు రావాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కోట్ల మేరకు వాయిదాలు, వడ్డీలు చెల్లిస్తున్నట్లు చెప్పారు.
గూండాగిరీ భయపడేది లేదు: పొంగులేటి
బీఆర్‌ఎస్ గూండాగిరీకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పిలిచిన టెండర్ మొత్తం కంటే మూడు నాలుగు రెట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం బీఆర్‌ఎస్ నేతల అవివేకానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీ నాయకుల ప్రవర్తన ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుందన్నారు. సవాల్‌ను స్వీకరించి తమ మంత్రులు వస్తే బీఆర్‌ఎస్ నేతలు పరారయ్యారన్నారు. అసెంబ్లీలో కూడా వాళ్లు ఏం మాట్లాడతారో తమకు తెలుసని, దానికి కూడా తేదీని ఖరారు చేస్తామని చెప్పారు.
అసెంబ్లీకి రావాలని కోరేందుకే కేసీఆర్‌కు ఫోన్ చేశా: దయాకర్
అసెంబ్లీకి రావాలని కోరేందుకే తాను కేసీఆర్‌కు ఫోన్ చేశానని అద్దంకి దయాకర్ తెలిపారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆయన ప్రభుత్వ విప్ వేముల వీరేశం, పార్టీ ఎమ్మెల్యేలు కుందూరు జయ్‌వీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతారహితంగా ఉన్నారని, పిచ్చికుక్కలను లేపి పంచాయతీ చేయిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావు వల్ల ఏమీ కాదని, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నం వారు చేస్తున్నారన్నారు. అధికారిక కార్యక్రమాలకు హాజరుకావాలని మంత్రులు వెళ్లి ఆహ్వానించినా కేసీఆర్ బయటకు రావట్లేదన్నారు. జీతం తీసుకోవడానికి మాత్రం ఆయన అసెంబ్లీకి వస్తాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక దద్దమ్మలా కేసీఆర్ ఇంట్లో ఉంటున్నారన్నారు.
చర్చించే దమ్ములేక అక్రమ అరెస్టులు: హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి తమతో చర్చించే దమ్ములేక అక్రమంగా అరెస్టు చేయించిందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని ఒక రోజు, రూ.7 లక్షల కోట్లని మరో రోజు మాట మార్చిన మంత్రి జూపల్లి చర్చకు రాకుండా తోకముడిచారని విమర్శించారు. మాట తప్పినందుకు జూపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం హరీశ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గోల్ కొడతాననుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందన్నారు. మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదని, దీంతో టెండర్లలో అవినీతి జరిగిందని తేటతెల్లమైందన్నారు. గురుకులాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల టెండర్లలో స్కాం జరిగిందని, ప్రభుత్వం కమీషన్ల కోసం నిబంధనలను ఉల్లంఘించి పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చిందని ఆరోపించారు. నోట్‌బుక్స్ కొనుగోళ్లలో రూ.150 కోట్ల కమిషన్ కోసం వాటర్‌మార్క్ నిబంధన పెట్టారన్నారు.
సీఎం, మంత్రులు తోకముడిచారు: కేటీఆర్
అప్పులపై చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తీరా సమయం వచ్చేసరికి తోకముడిచి పారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. స్వయంగా తెలంగాణ భవన్‌కు వస్తున్నానని ప్రగల్భాలు పలికిన మంత్రి జూపల్లి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి, శాలువాతో మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. రాకపోగా మరో చోట డ్రామాకు తెరలేపారన్నారు. సీఎం, మంత్రులకు చర్చించే దమ్ముంటే వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. కాగా, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో 20 వేల ఖాళీలు ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.