నెలలోగా నామినేటెడ్ పదవుల భర్తీ
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:47 AM
తెలంగాణలో నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవులను నెలలోగా భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో..
పార్టీ సంస్థాగత పదవులనూ భర్తీ చేస్తాం
తెలంగాణలో శాస్త్రీయంగా కులగణన సర్వే
ఢిల్లీలో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో సమావేశం
ఏఐసీసీ ఓబీసీ సమావేశాన్ని
హైదరాబాద్‌లో నిర్వహించాలని వినతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో నామినేటెడ్, పార్టీ సంస్థాగత పదవులను నెలలోగా భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతోపాటు వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీపై రాహుల్ గాంధీతో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ పనితీరుతోపాటు కులగణన తదితర కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఆ వివరాలను మహేశ్‌గౌడ్ మీడియాకు వివరించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పదవుల భర్తీలో ప్రభుత్వం, పార్టీ మధ్య మరింత సమన్వయం ఉండేలా చూస్తున్నామని తెలిపారు. రాబోయే ఏఐసీసీ జాతీయ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరగా.. రాహుల్‌గాంధీ అంగీకరించారని తెలిపారు. బీసీ సాధికారిత పోరాటానికి తెలంగాణ వేదికగా మరింత మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ రిజర్వేన్ల అంశాన్ని జోడించాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మహేశ్‌గౌడ్ ఖండించారు. సర్వేలో ఎలాంటి లోపం జరగలేదని, అత్యంత శాస్ర్తీయ పద్థతిలో వివరాల నమోదు జరిగందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ చేసినట్లు హడావుడిగా ఒక్క రోజులోనే సర్వే చేసి చేతులు దులుపుకోలేదన్నారు. కాగా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, సీనియర్ నేత వి.హనుమంతరావు వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత అనిల్ తన భార్యాపిల్లలను రాహుల్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పిల్లలను రాహుల్ ఆప్యాయంగా పలకరించారు.