మార్చి 15లోపు పదవులన్నీ భర్తీ
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:25 AM
మార్చి 15వ తేదీకి నాటికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు.
పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా..
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై 2,3 రోజుల్లో నిర్ణయం: మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మార్చి 15వ తేదీకి నాటికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీపీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా, బ్లాక్, బూత్ కమిటీల నియామకం పూర్తిచేస్తామన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించాం. అయితే.. రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ అయిన తనను పిలిచి చర్చిస్తామని అధిష్ఠానం తెలిపింది. మంత్రివర్గ విస్తరణపై ఏ చర్చ జరగలేదు. ఈ అంశంపై సీఎం రేవంత్ హైకమాండ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి మాట్లాడతామని రాహుల్, ఖర్గే చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలను, రాజకీయంగా, ప్రభుత్వ పరమైన అన్ని అంశాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు’ అని వెల్లడించారు. ఇక మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రివర్గాన్ని అభినందించారని చెప్పారు. ఇక భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై ఖర్గే సూచనలు చేశారని తెలిపారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. కేసీఆర్ హామీల్లా గాలికి వదిలేయబోమన్నారు. అధిష్ఠానం వద్ద తెలంగాణ కాంగ్రెస్ మోకరిల్లిందని బీఆర్‌ఎస్, బీజేపీ అనడం వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ అధిష్ఠానం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. అప్పుడప్పుడైనా బీజేపీ నేతలు ప్రజలు గురించి ఆలోచించాలంటూ హితబోధ చేశారు.
హరీశ్‌రావు మతి తప్పింది: చామల
మునిసిపల్ ఎన్నికల దెబ్బకు హరీశ్‌రావు మతి స్థిమితం కోల్పోయి సొల్లు కబుర్లు చెబుతున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేదన్నారు. కేసీఆర్ లాగా సీఎం రేవంత్‌రెడ్డి ఫాంహౌస్ పాలన సాగించట్లేదని గురువారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అధిష్ఠానం వద్ద జరిగిన సమావేశం పార్టీ సమావేశమని, క్యాబినెట్ సమావేశం 23న సచివాలయంలో జరుగుతుందన్న సంగతి హరీశ్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ వల్లనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. కాగా, రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి పోటీలో లేనని.. ఆ పదవిపై తనకు ఏ ఆసక్తి లేదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు స్పష్టం చేశారు.