Share News

సీఎం, టీపీసీసీ చీఫ్‌ తర్వాత నేనే నంబర్‌ త్రీ..!

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:23 AM

‘రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తర్వాత నేనే నంబర్‌ త్రీ.. మా డాడీ ఫొటో లేకుండా ఫ్లెక్సీ కడితే చింపేస్తా.. రాహుల్‌ గాంధీకి చెప్పుకుంటవా..

సీఎం, టీపీసీసీ చీఫ్‌ తర్వాత నేనే నంబర్‌ త్రీ..!

  • మా డాడీ ఫొటో లేకుండా ఫ్లెక్సీ కడితే చింపేస్తా

  • రాహుల్‌ గాంధీకే కాదు.. ఎవరికైనా చెప్పుకో !

  • యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడి తిట్ల దండకం

  • సోషల్‌ మీడియాలో శివచరణ్‌రెడ్డి ఆడియో వైరల్‌

మన్సూరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తర్వాత నేనే నంబర్‌ త్రీ.. మా డాడీ ఫొటో లేకుండా ఫ్లెక్సీ కడితే చింపేస్తా.. రాహుల్‌ గాంధీకి చెప్పుకుంటవా.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..!’ అంటూ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నాయకురాలు పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్‌, ఆమె కుటుంబ సభ్యులపై తిట్లదండకం ఎత్తుకున్నారు. ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులకు నేరుగా ఫోన్‌ చేసి శివచరణ్‌ రెడ్డి బెదిరించినట్ల్లుగా ఉన్న ఓ కాల్‌ రికార్డింగ్‌ ఆడియో ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యురాలిగా నియమితులైన ఈశ్వరమ్మ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆమె మద్దతుదారులు ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ పరిసరాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో తన తండ్రి, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదంటూ శివచరణ్‌రెడ్డి.. ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముప్పై ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ వస్తున్న నా తండ్రి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఫొటో లేకుండా ఫ్లెక్సీ కడితే చింపేస్తా.. ఫ్లెక్సీ డిజైన్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ యువ నాయకుడి హస్తం ఉంది.


పూటకో పార్టీ మారే మీరు మా తండ్రి ఫొటో పెట్టకుండా అవమానిస్తారా..? నేను చిన్నపిల్లగాడిలా కనిపిస్తున్నానేమో.. రాష్ట్రంలో నేను నంబర్‌ త్రీ.. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తర్వాత నేనే పెద్ద.. ఈ విషయంలో మల్‌రెడ్డి రాంరెడ్డి, మధు యాష్కీలకే కాదు రాహుల్‌ గాంధీకి చెప్పుకున్నా ఏమీ కాదు..’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా, వైటీడీ ట్రస్టు బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మయాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శివచరణ్‌రెడ్డిపై యాదవ సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశ్వరమ్మ యాదవ్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Updated Date - Jul 13 , 2026 | 05:28 AM