సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:20 AM
తెలంగాణలో సెక్యులర్ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.
డీసీసీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్ల భేటీలో మహేశ్‌గౌడ్
బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలి: మీనాక్షి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సెక్యులర్ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే ఎస్‌ఐఆర్ (సర్)ను చేపడుతోందన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో సోమవారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మహేశ్‌గౌడ్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏ)నియామకం, బ్లాక్ స్థాయి వరకూ కమిటీల ఏర్పాటుపైవారు దిశానిర్దేశనం చేశారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీఎల్‌ఏల నియామకం విషయంలో ఎక్కడా రాజీపడొద్దన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని పథకాలు.. తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో అత్యధికంగా లోక్‌సభ, శాసనసభ సీట్లు గెలవాలన్నారు. ఇందులో భాగంగానే బీఎల్‌ఏల నియామకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ఉంటుందని తెలిపారు. మీనాక్షి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా కాకుండా.. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తేనే వచ్చే ఎన్నికల నాటికి కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం సాధించగలుగుతామని వ్యాఖ్యానించారు.