రాజ్యసభకు సుదర్శన్‌రెడ్డి, సింఘ్వి?
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:52 AM
తెలంగాణకు సంబంధించి ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డితోపాటు అభిషేక్ మను సింఘ్వికి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది.
తెలంగాణ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం
రేసులో వేం నరేందర్‌రెడ్డి, హర్కార
బీసీల్లోనూ భారీగా ఆశావహులు
10 రాష్ట్రాల్లోని 37 సీట్లకు మార్చి 16న ఎన్నికలు.. ఈ నెల 26న నోటిఫికేషన్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు సంబంధించి ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డితోపాటు అభిషేక్ మను సింఘ్వికి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. తెలంగాణ నుంచి కె కేశవరావు రాజీనామాతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వి, బీఆర్‌ఎస్ ఎంపీ సురే్‌షరెడ్డి పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఇందులో ఒక స్థానాన్ని అధిష్ఠానం తన కోటా కింద తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభకు ఎన్నికై ఏడాదిన్నర మాత్రమే అవుతున్న నేపథ్యంలో ఆయన్ను మరోసారి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రెండో స్థానానికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన సుదర్శన్‌రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసి గౌరవించుకోవాలన్న ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, అసెంబ్లీలో వాస్తవ బలాబలాలను పరిశీలిస్తే రెండో సీటును గెలిపించేందుకు కాంగ్రెస్ సంఖ్యాబలం సరిపోదు. ఏడుగురు సభ్యులున్న మజ్లి్‌సతోపాటు అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కోరాల్సి ఉంటుంది. మరో వైపు.. బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థిని నిలబెడితే 8 మంది సభ్యులున్న బీజేపీ మద్దతిస్తుందా? లేదా? అనే విషయంపైనా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ప్రముఖ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దించితే గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాలున్నాయి. ఇందులో భాగంగానే సుదర్శన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటు రేసులో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ పేర్లు వినిపిస్తుండగా, బీసీ కోటాలో సీనియర్ నేత వి.హన్మంతరావు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా అనూహ్యంగా కొత్త వారి పేర్లను తెరపైకి తీసుకువచ్చిన చరిత్ర కాంగ్రె్‌సలో ఉందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
10 రాష్ట్రాలు.. 37 సీట్లు
పది రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ సీట్లకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మహారాష్ట్రలో 7, ఒడిసాలో 4, తమిళనాడులో 6, పశ్చిమబెంగాల్‌లో 5, అస్సోంలో 3, బిహార్‌లో 5, ఛత్తీ్‌సగఢ్‌లో 2, హరియాణాలో 2, తెలంగాణలో 2, హిమాచల్‌లో ఒక సీటు ఖాళీ కానున్నాయి. పదవీవిరమణ చేయనున్న ప్రముఖుల్లో మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, తమిళనాడు నుంచి డీఎంకే నేతలు కనిమొళి, తిరుచ్చి శివ, అన్నాడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ ఎంపీ జీకే వాసన్, అస్సోం నుంచి బిజెపి నేత భువనేశ్వర్ కలితా, తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేత అబిషేక్ మను సింఘ్వీ, బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి ఉన్నారు. రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు 26న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్లను దాఖలుకు చివరి తేదీ మార్చి5 కాగా, వాటిని మార్చి 6న పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించేందు కు మార్చి9 చివరితేదీగా నిర్ణయించారు. మార్చి 16న ఆయా అసెంబ్లీలలో ఉదయం 9నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5కు ఓట్లలెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.