రాహుల్‌ను ప్రధానిని చేయటమే లక్ష్యం
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:51 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయటమే తమ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి పిలుపు మేరకు..
తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తాం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
గాంధీభవన్‌లో ఇద్దరు నేతల సమావేశం
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేయటమే తమ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి పిలుపు మేరకు కోమటిరెడ్డి చాలా సంవత్సరాల విరామం తర్వాత శనివారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌కు వచ్చారు. ఇద్దరు నేతలు సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ దేశ ప్రధాని కావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి వంటి సీనియర్ నాయకులు ఒక టీమ్‌గా కలిసివచ్చి పనిచేస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందని జగ్గారెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి అత్యంత కీలకమైన నాయకుడని, తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయన చేసిన పోరాటాలు అసామాన్యమైనవని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన రాజకీయంగా అండగా నిలిచారని ప్రశంసించారు. కాంగ్రెస్ శ్రేణలతో ఆయనకు బలమైన అనుబంధం ఉందని కొనియాడారు. మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తాను ఎప్పుడూ పదవుల కోసం ఎదురుచూడలేదని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘నేను పదవులు అడుక్కునే వ్యక్తిని కాదు. నేను ఫైటర్‌ని. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, రాహుల్‌గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే మా లక్ష్యం. పదవుల విషయంలో రాహుల్‌గాంధీ నిర్ణయమే మాకు ఫైనల్’ అని స్పష్టంచేశారు. తమ భేటీలో తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నేతల మధ్య విబేధాల అంశం ప్రధాన ఎజెండా కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తుంగతుర్తి రాజకీయాల వ్యవహారాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని, స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ... ఇలాంటి పంచాయితీలను పరిష్కరించే బాధ్యతను జగ్గారెడ్డికే అప్పగించడం మంచిదని వ్యాఖ్యానించారు. తుంగతుర్తి వివాదం ఇప్పటికే ముగిసిన అంశమని పేర్కొన్నారు.