ఇది నినాదం కాదు.. గొప్ప సంకల్పం!
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:30 AM
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కేవలం ఒక నినాదం కాదని, అది పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లే ఒక గొప్ప సంకల్పమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికతో రాష్ట్రాభివృద్ధికి 99 రోజుల రోడ్‌మ్యాప్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కేవలం ఒక నినాదం కాదని, అది పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లే ఒక గొప్ప సంకల్పమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల ప్రణాళిక రాష్ట్రాభివృద్ధికి ఒక దిశానిర్దేశం చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలే కేంద్ర బిందువుగా ఐదు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని.. ఏప్రిల్ 2న గ్రామ సభలతో మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయుల మీదుగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి సమగ్ర విశ్లేషణతో ముగుస్తుందని శనివారం ఓ ప్రకటనలో వివరించారు. క్షేత్రస్థాయిలోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పది ప్రధాన థీమ్‌లను ప్రభుత్వం ఎంచుకుందని తెలిపారు. పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, విద్యా రంగంలో మార్పులు, రైతు సంక్షేమం వంటి ఆంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు, రోడ్డు భద్రత కోసం అరైవ్-అలైవ్ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికతను జోడించి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ 99 రోజుల పురోగతిని పర్యవేక్షిస్తున్నామని, ఇది పాలనలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని వెల్లడించారు. ఈ ప్రగతి ప్రణాళిక రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ సంస్కృతికి నాంది అని అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు మహేశ్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.