కలిసొస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి బాధ్యతలు
ABN , Publish Date - May 25 , 2026 | 04:37 AM
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులకు అనుబంధంగా పనిచేసిన ఇన్‌చార్జి కార్యదర్శులకు తమ సొంత రాష్ట్రాల్లో కలిసివస్తోంది.
ఇప్పటికి మంత్రులైన ముగ్గురు ఇన్‌చార్జి కార్యదర్శులు
హైదరాబాద్, మే 24(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులకు అనుబంధంగా పనిచేసిన ఇన్‌చార్జి కార్యదర్శులకు తమ సొంత రాష్ట్రాల్లో కలిసివస్తోంది. తెలంగాణ ఏర్పాటైన దగ్గరి నుంచి ఇప్పటి దాకా పనిచేసిన ఇన్‌చార్జి కార్యదర్శుల్లో ముగ్గురు.. వారి సొంత రాష్ట్రాల్లో మంత్రులయ్యారు. మరొకరు సొంత రాష్ట్రంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2018 ఎన్నికల ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించిన కుంఠియాకు అనుబంధంగా అధిష్ఠానం కర్ణాటకకు చెందిన బోసురాజును తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమించింది. 2018 ఎన్నికల్లోనూ, ఆ తర్వాతా ఆయన పార్టీలో కీలక భూమిక పోషించారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత.. అధిష్ఠానం బోసురాజుకు కర్ణాటక మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకున్నా ఎమ్మెల్సీని చేసి మరీ క్యాబినెట్‌లో చోటు కల్పించింది. అలాగే కర్ణాటకకే చెందిన సలీం అహ్మద్ గతంలో తెలంగాణలో ఇన్‌చార్జి కార్యదర్శిగా వ్యవహరించారు. తదనంతర కాలంలో ఆయనను అధిష్ఠానం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అలాగే ఎమ్మెల్సీనీ చేసింది. ఇక ఇటీవలి వరకూ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శులుగా వ్యవహరించిన విష్ణునాథ్‌కు కేరళ మంత్రివర్గంలో, విశ్వనాథన్‌కు తమిళనాడు మంత్రివర్గంలో చోటు దక్కింది. కేరళ ఎన్నికల్లో పోటీ చేసిన విష్ణునాథ్.. ఆ ఎన్నికలకు ముందే ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో అధిష్ఠానం సచిన్ సావంత్‌ను నియమించింది. కేరళ ఎన్నికల్లో గెలిచిన విష్ణునాథ్‌కు యూడీఎఫ్ మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక తమిళనాడుకు చెంది న పి.విశ్వనాథన్‌కు అనుకోని అవకాశం దక్కింది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కేవ లం ఐదు సీట్లు గెలుచుకుంది. ఎన్నికల అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల్లో విజయ్ పార్టీ టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ నుంచి ఇద్దరికి విజయ్ క్యాబినెట్‌లో చోటు దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరైన విశ్వనాథన్‌కు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి కార్యదర్శులుగా వ్యవహరించిన వారిని సొంత రాష్ట్రాల్లో అదృష్టం కలిసొస్తుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
సీఎం రేవంత్‌ను కలిసిన తమిళనాడు మంత్రి విశ్వనాథన్
తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వనాథన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. కొత్తగా తమిళనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను అభినందించారు. ప్రజాభవన్‌కు వెళ్లిన విశ్వనాథన్.. మంత్రి సీతక్కను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.