13 నెలల్లో లక్ష ఇళ్లు పూర్తి
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:41 AM
ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన 13 నెలల్లోనే దాదాపు లక్ష ఇళ్లు పూర్తి చేశామని.. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద గృహ విప్లవమని మంత్రి పొంగులేటి .....
దేశ చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం
2 నెలల్లో మరో 2 లక్షలు పూర్తి చేస్తాం
నేడు రెండోవిడత ఇళ్లకు సీఎం శ్రీకారం
దేవుళ్లు, మతాల పేరిట కొన్ని పార్టీల రాజకీయాలు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ఖమ్మం రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన 13 నెలల్లోనే దాదాపు లక్ష ఇళ్లు పూర్తి చేశామని.. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద గృహ విప్లవమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయంతో భారీ ఎత్తున చేపట్టిన ఈ పథకంతో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఇది గృహ నిర్మాణ కార్యక్రమమే కాకుండా.. సీఎం రేవంత్ నాయకత్వంలో మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వీటిలో ఇప్పటివరకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఒకటి రెండు నెలల్లో మరో రెండు లక్షల ఇళ్లు పూర్తికాబోతున్నాయని తెలిపారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కెరిమర మండలంలోని కొఠారి గ్రామంలో రెండో విడత కింద 2.50 లక్షల ఇళ్లను సీఎం రేవంత్ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కొత్తగూడలో సామూహిక గృహప్రవేశంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. కాగా, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయడానికి... 2023లో గృహలక్ష్మి పథకంలో ఇళ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి...రెండో విడతలో ఆర్థికసాయాన్ని అందిస్తామన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్రం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలను కొనసాగిస్తున్నాయన్నారు. తెలంగాణ మాత్రం పేదవాడి ఇల్లు - ప్రభుత్వ బాధ్యత అనే లక్ష్యంతో సొంత నిధులనే ఖర్చు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం రూ.72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్థిదారుడికి రూ.5 లక్షల సాయం అందిస్తోందన్నారు. అంతకుముందు మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్ మండలంలోని కొండాపురంలో రూ.5.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే.. రూ.25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని తెలిపారు.అన్ని రకాల పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తున్నామన్నారు. దేవుళ్లు, మతాల పేరిట కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండేళ్లలోనే 72వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని మంత్రి పొంగులేటి తెలిపారు.