Share News

30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:51 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పాత బకాయిలు రూ.8 వేల కోట్లను విడుదల చేయాలన్న డిమాండ్లతో..

30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌

  • కలెక్టరేట్‌, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయల ముట్టడి

  • పాత బకాయిలను చెల్లించాల్సిందే: ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌/రాంనగర్‌/గన్‌పార్క్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పాత బకాయిలు రూ.8 వేల కోట్లను విడుదల చేయాలన్న డిమాండ్లతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌ చేపట్టనున్నట్లు ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. అలాగే అదే రోజున కలెక్టరేట్‌, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిర్వహించిన 14 బీసీ సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తోందని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేసే కుట్రలు: జాజుల

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోందని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. ప్రభుత్వ బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌ చేపడుతున్నట్లు ప్రకటించారు. అలాగే జూలై 15న సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు ‘చలో హైదరాబాద్‌’ విద్యార్థి మార్చ్‌ నిర్వహించి, బడుగు విద్యార్థుల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. బీసీ భవన్‌లో నిర్వహించిన బీసీ విద్యార్థి, యువజన సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో జాజుల మాట్లాడారు.

Updated Date - Jun 27 , 2026 | 06:52 AM