Share News

రూ.158 కోట్ల సీఎంఆర్‌ స్వాహా!

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:20 AM

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)కు సంబంధించి ఉమ్మడి కరీంనగర్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు బయటపడ్డాయి. మిల్లర్లు రూ.158 కోట్ల మేర సీఎంఆర్‌ను బహిరంగ మార్కెట్‌లో..

రూ.158 కోట్ల సీఎంఆర్‌ స్వాహా!

  • ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రైస్‌మిల్లర్ల దందా

  • ఓ రైస్‌మిల్‌కు చెందిన ఇద్దరి అరెస్టు, రిమాండ్‌

సుల్తానాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)కు సంబంధించి ఉమ్మడి కరీంనగర్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు బయటపడ్డాయి. మిల్లర్లు రూ.158 కోట్ల మేర సీఎంఆర్‌ను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా భారీగా సొమ్ము చేసుకున్నారు. వీరిలో ఓ రైస్‌మిల్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాంరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లో బియ్యాన్ని అమ్ముకొని రూ.158 కోట్లను పక్కదారి పట్టించడం ద్వారా పౌర సరఫరాల సంస్థను మిల్లర్లు మోసం చేశారని తెలిపారు. శ్రీరాములపల్లిలోని సీతారామ ఆగ్రో ఇండస్ర్టీస్‌లో రూ.69 కోట్లు, జమ్మికుంట పరిధిలోని కోరపల్లిలోని మహాశక్తి ఇండస్ట్రీ్‌సలో రూ.62 కోట్లు, సుల్తానాబాద్‌ సాయిమహాలక్ష్మీ ఇండస్ర్టీస్‌లో రూ.20 కోట్లు, సౌభాగ్య ఇండస్ర్టీస్‌లో రూ.7 కోట్ల మేర విలువైన బియ్యాన్ని నిర్వాహకులు బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. వీరిపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మంగళవారం పూసాల గ్రామ పరిధిలోని సౌభాగ్య ఇండస్ట్రీ్‌స మేనేజింగ్‌ పార్టనర్‌ బండారి మారుతి, ఆయన భాగస్వామి సొక్కం అంజయ్య రూ.7కోట్ల కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను అమ్ముకున్నారని డీసీపీ వెల్లడించారు. తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 2023-24 రబీ సీజన్‌ సీఎంఆర్‌కు సంబంధించి సౌభాగ్య ఇండస్ట్రీ్‌సకు 3116.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించింది. వీరు 2024 సెప్టెంబరు 30వ తేదీలోపు 2119.125 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ 515.158 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పగించి మిగిలిన 1603.967 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని డీసీపీ వివరించారు. 2025 జూలైలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, జిల్లా పౌర సరఫరా అధికారులు జరిపిన తనిఖీల్లో 1088.014 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.7 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు డీసీపీ పేర్కొన్నారు. బండారి మారుతి, అంజయ్యలను రిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 24 , 2026 | 04:20 AM