మూసీ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:45 AM
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాలు కేటాయిస్తాం
అంతర్జాతీయస్థాయిలో మామునూరు ఎయిర్‌పోర్ట్ కట్టండి
మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడుకు వినతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తొలుత రాజ్‌నాథ్ సింగ్‌తో సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గురించి వివరించారు. ఈసా.. మూసీ నదుల సంగమస్థలిలో.. 1948లో మహాత్ముడి చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని రక్షణమంత్రిని ఆహ్వానించారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసి.. కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయం మొత్తాన్నీ తామే భరిస్తామని ఇప్పటికే తెలియజేసిన విషయాన్ని సీఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైలు మార్గంలోని టేకల్‌కోడ్‌లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. అలాగే.. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూర్, హైదరాబాద్-పుణే హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని రైల్వే మంత్రికి సీఎం తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని విన్నవించారు. దాంతో డైప్రోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని తెలియజేశారు. హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్‌అవుతుందని వివరించారు.
ఈ మూడు కారిడార్లకూ వెంటనే భూసేకరణ చేసి, పనులు ప్రారంభించాలని కేంద్రమంత్రిని కోరారు. సీఎం విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇక.. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును కలిసి.. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు వెంటనే చేపట్టి, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయంలో కార్గో సేవలతోపాటు మెయింటెనెన్స్.. ఓవర్ హాల్ రిపేర్ (ఎంవోఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. దాని ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు.. విమానాశ్రయ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను పంపిస్తానని హామీ ఇచ్చారు.
అదనపు ధాన్యం..
వానాకాలం పంటకు (2025- 26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10 శాతం నూకతో ఎఫ్‌సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం విజ్ఞప్తి చేశారు. గురువారం కేంద్ర మంత్రితో ఆయన నివాసంలో.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ భేటీ అయ్యారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కోరారు. 2024-25 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలలు పొడిగించాలని విన్నవించారు. భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
పురపోరులో మెజారిటీ స్థానాలు మనవే
స్థానిక సంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం
రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్
మునిసిపోల్స్‌లో మెజారిటీ స్థానాలు సాధిస్తామని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. గురువారం రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయని, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని వారికి తెలిపారు. బుధవారం 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగాయని.. శుక్రవారం వాటి ఫలితాలు వెలువడనున్నాయని వెల్లడించారు. ఈ ఎన్నికల్లోనూ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నదని రాహుల్, కేసీలకు రేవంత్ వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. కాగా.. క్షేత్రస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్‌ను అభినందించారు.