ఫ్యూచర్‌సిటీలో త్వరలో శంకుస్థాపనలు
ABN , Publish Date - May 04 , 2026 | 04:54 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్‌సిటీ’ అభివృద్ధికి సంబంధించి కీలక అడుగు పడింది. త్వరలో అక్కడ పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీల భవనాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భవనాలకు ప్రారంభోత్సవాలు
లైఫ్‌సైన్సెస్ కంపెనీల పర్యావరణహిత పరిశోధనా కేంద్రాలు,ప్రధాన రోడ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ భవనం ప్రారంభం
సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్‌సిటీ’ అభివృద్ధికి సంబంధించి కీలక అడుగు పడింది. త్వరలో అక్కడ పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీల భవనాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. కొన్ని భవనాల ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఈ నెల మూడోవారంలో సీఎం రేవంత్‌రెడ్డి పలు భవనాలకు భూమిపూజ, శంకుస్థాపన చేయడంతోపాటు కొన్ని భవనాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న కొన్ని భవనాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ షెడ్యూల్‌లో మార్పులు జరగడంతో ఈ నెల మూడోవారం, నాలుగో వారంలోనే ఆ కార్యక్రమాలను పూర్తిచేయాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ముందుగా ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇక 25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) ప్రాంగణం భవనానికి, పదెకరాల్లో ఏర్పా టు చేయబోయే సింగరేణి ప్రధాన కార్యాలయ భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. వీటితోపాటు డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, హెటిరో, ఎంఎ్‌సఎన్, అరబిందో వంటి ఫార్మా కంపెనీలకు చెందిన పర్యావరణ హితంగా నడిచే పరిశోధనా కేంద్రాలు, ప్యాకేజింగ్ యూనిట్లకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది.
పర్యావరణ పరిరక్షణకు జాగ్రత్తలు..
దేశంలోనే మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపొందుతున్న ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ అనుకూల రవాణా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. టెక్నాలజీలో రోజురోజుకూ కీలకంగా మారుతున్న డేటా సెంటర్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ కంపెనీల డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. దీంతో పలు కంపెనీలు తమ డేటా సెంటర్లను రాష్ట్రంలో నెలకొల్పుతుండగా, మరికొన్ని ముందుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్, కంట్రోల్ ఎస్, హైపర్వాల్ట్ కంపెనీల డేటా సెంటర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో శంకుస్థాపన చేస్తారని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఎస్యూ) శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని యుద్థ ప్రాతిపదికన కొనసాగించి.. రాబోయే కొద్ది నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో పనుల్లో వేగం పుంజుకుంది. త్వరలోనే దానిని పూర్తిచేసి, ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పలు సంస్థలను కూడా ఫ్యూచర్‌సిటీ వైపే తరలించనున్నారు. ఇందులో భాగంగా తొలుత తోలు పరిశ్రమల అభివృద్ధికి, తోలు ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడం, ఆ రంగంలోని వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం దాదాపు 50 ఎకరాల్లో ఒక విశ్వవిద్యాలయాన్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. అందుకు అవసరమైన భవనం, డిజైనింగ్ వ్యవహారాలు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు సైతం 50ఎకరాల్లో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. యువతకు పలు రంగాల్లో నైపుణ్యం కల్పించేందుకు అక్కడ ప్రత్యేకఏర్పాట్లు చేయనున్నారు. వీటితోపాటు ఫ్యూచర్‌సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపైనా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యూచర్‌సిటీని పలు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో.. జోన్లను అనుసంధానం చేసేలా ప్రధాన రోడ్లు, నీటి సరఫరా తదితర సదుపాయాలకు సంబంఽధించిన మొదటి దశ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.