ఆ భూములు శారదా పీఠానికే..
ABN , Publish Date - Mar 01 , 2026 | 05:01 AM
స్వామి స్వరూపానందకు చెందిన శారదా పీఠానికి బీఆర్‌ఎస్ హయాంలో కోకాపేటలో కేటాయించిన రెండు ఎకరాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటోందని, అక్కడి ఆలయాన్ని కూల్చి వేస్తున్నారని...
జలమండలికి చేసిన కేటాయింపులు రద్దు
వాస్తవ స్థితిగతులు తెలియజేయని అధికారులపై ఆగ్రహం
హైదరాబాద్, నార్సింగ్, శంషాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): స్వామి స్వరూపానందకు చెందిన శారదా పీఠానికి బీఆర్‌ఎస్ హయాంలో కోకాపేటలో కేటాయించిన రెండు ఎకరాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటోందని, అక్కడి ఆలయాన్ని కూల్చి వేస్తున్నారని, పోలీసులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారంటూ శనివారం పెద్దఎత్తున ప్రచారం సాగింది. మాజీ మంత్రి హరీశ్ రావు, కొంతమంది ఆరెస్సెస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి ఆలయాన్ని కూల్చవద్దని డిమాండ్ చేశారు. శారదాపీఠం జోలికొస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వం అప్రమత్తమైంది. కోకాపేటలో భూములు శారదా పీఠానికే యథాతథంగా కేటాయించాలని నిర్ణయించింది. ఆ భూములను పీఠానికే వదిలేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజానికి, శారదా పీఠానికి చెందిన రెండెకరాలను శనివారం ప్రభుత్వం జలమండలికి కేటాయించింది. ఇందుకు ప్రతిగా శంషాబాద్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్ సర్వే నంబరు 725/19లో రెండెకరాలను కేటాయించారు. ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ భూములను శారదా పీఠానికి కేటాయించామని, హద్దులను వారికి చూపించామని శంషాబాద్ మండల తహసీల్దారు రవీందర్ దత్ తెలిపారు. అయితే, ఆ భూముల్లో రాజశ్యామల ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని పీఠం ప్రతినిధులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఈ అంశంపై సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. కోకాపేట శారదా పీఠానికి కేటాయించిన భూముల్లో ఆలయంతోపాటు వివిధ నిర్మాణాల తాజా స్థితి ఏమిటని ఆరా తీశారు. అక్కడ రాజశ్యామల ఆలయంతోపాటు ఇతర పనులు జరుగుతున్నాయని అధికారులు నివేదించారు. దీంతో, అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే ముందు వాస్తవ స్థితిగతులను ఎందుకు వివరించలేదని మండిపడ్డారు. జలమండలికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యథాతథంగా శారదా పీఠం చేతుల్లోనే ఆ భూములు ఉండాలని ఆదేశించారు. పీఠంలో నిర్మాణాలు, ఇతర పరిస్థితులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి, వివరించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.
దేవుడి మాన్యాలపై రేవంత్ కళ్లు: హరీశ్
పేదల ఇళ్లతోపాటు ఇప్పుడు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కోకాపేట్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘జల మండలికి ఈ స్థలమే దొరికిందా!? ఈ రోడ్డుకు అవతల సర్వే నంబరు 239, 240ల్లో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా!? దానిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ పేరిట అక్రమంగా కట్టబెట్టారు కదా! అల్లుడి వ్యాపారానికి 17 ఎకరాలు ఇచ్చే రేవంత్‌రెడ్డి.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారదా పీఠానికి చెందిన భూములను లాక్కుని కూలుస్తారా!?’’ అని నిలదీశారు. అయితే, ఈ భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిసిన తర్వాత ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, నిత్య పూజలు, వేద పాఠశాల, నిత్యాన్నదానం జరిగే శారదా పీఠం జోలికి వస్తే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడ్డపార సర్కారుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. అయితే, ప్రభుత్వం వెనక్కి తగ్గిన తర్వాత ఆయన కూడా హర్షం వ్యక్తం చేశారు.