Share News

ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే ఉపేక్షించొద్దు

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:54 AM

ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతి నెలా క్షేత్ర స్థాయికి వెళ్లాలని గతంలోనే ఆదేశించాను. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు....

ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే ఉపేక్షించొద్దు

  • క్షేత్రస్థాయికి వెళ్లని అధికారులపై నివేదిక ఇవ్వండి.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ కోరండి

  • 3 నెలలపాటు చేసిన పనులకు తగినంతగా ప్రచారం కల్పించండి

  • విద్య, వైద్య శాఖల్లో ముఖ హాజరు విధానం అమలు చేయండి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతి నెలా క్షేత్ర స్థాయికి వెళ్లాలని గతంలోనే ఆదేశించాను. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై నివేదిక ఇవ్వండి’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. వారిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వెంటనే వివరణ కోరాలని నిర్దేశించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులను ఉపేక్షించవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 99 రోజులపాటు చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాలపై అన్ని విభాగాలు నివేదికలను సమర్పించాయి. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. అయుతే, కొన్ని విభాగాలు చేసిన పనులను ఆశించినంతగా చెప్పుకోలేకపోయాయని అభిప్రాయపడిన ముఖ్యమంత్రి.. వెంటనే అన్ని శాఖలు తాము చేపట్టిన కార్యక్రమాలకు తగినంత ప్రచారం కల్పించాలని సూచించారు. సంబంధిత ఉన్నతాధికారులు ఆ బాధ్యతలు తీసుకోవాలని నిర్దేశించారు. మీడియా, డిజిటల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తాము చేసిన మంచి పనులు చెప్పుకోవాలని సూచించారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.


ఈ మూడు నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ఆస్తుల కల్పన వివరాలన్నింటినీ నమోదు చేయాలని చెప్పారు. ఇప్పటికీ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేయాలని, అక్కడ భవన నిర్మాణాలు చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని పంచాయతీరాజ్‌ అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని పాఠశాలల భవనాలపై సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్య, వైద్య విభాగాల్లో అన్ని స్థాయుల్లో ముఖ హాజరు (ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు) విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్‌సీ నుంచి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వరకు ఇదే విధానాన్ని పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంపై జిల్లాలవారీగా కూడా సమీక్షలు జరపాలని, రాష్ట్రస్థాయి నుంచి జిల్లాకో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించి, ఆ జిల్లాకు పంపించాలని చెప్పారు. స్పెషలాఫీసర్‌ ఆ జిల్లా కలెక్టర్‌ను కలిసి అన్ని విభాగాల్లో 99 రోజులపాటు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, వివిధ పథకాలపై వచ్చిన స్పందనలను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ప్రగతి నివేదికలను విడుదల చేయాలని చెప్పారు. అలాగే, గ్రామాలవారీగా ప్రభుత్వ పథకాలను అందుకున్న లబ్ధిదారులు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సిద్ధం చేయాలని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సీఎం అధికారులను ఆరా తీశారు.

Updated Date - Jun 16 , 2026 | 04:54 AM