Share News

ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:49 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు గురువారం పార్లమెంటు ముందుకురానున్న ....

ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/మహదేవపూర్‌ రూరల్‌/కాటారం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు గురువారం పార్లమెంటు ముందుకురానున్న నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలకు అందుబాటులో ఉండేందుకు.. ఈ విషయంలో దక్షిణాది ఇతర రాష్ట్రాల నాయకులను సమన్వయం చేసుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశముంది. ఇటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సహా పలువురు ముఖ్య నేతలు కూడా వేం నరేందర్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారు. వేం నరేందర్‌ రెడ్డితో పాటుగా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్‌ మను సింఘ్వీ, మరో 14 మంది సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.

20న మేడిగడ్డకు సీఎం

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఈనెల 20న సీఎం రేవంత్‌ పరిశీలించనున్నారు. బ్యారేజీ పునరుద్ధరణ కోసం పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపై సమీక్ష జరిపి.. అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ పర్యటనలో నీటిపారుదలశాఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొంటారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్ఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం తీసుకునే చర్యలపై సీఎం సమీక్ష చేయనున్నారు. వారం కిందటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం జరిగే పరీక్షలపై సమీక్ష జరిపిన ఆయన.. నిర్ణీత వ్యవధిలోగా పరీక్షలు పూర్తి చేసి, పునరుద్ధరణ డిజైన్లు ఖరారు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాశ్‌రెడ్డితో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

Updated Date - Apr 16 , 2026 | 03:49 AM