Share News

ఏఐ సునామీ వస్తోంది

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:29 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సునామీలా వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే ఆందోళన నెలకొందని, దేశంలోని కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఏఐ సునామీ వస్తోంది

  • ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధం కావాలి.. వైట్‌ కాలర్‌కు బదులు బ్లూకాలర్‌ ఉద్యోగాలు పెంచాలి

  • విద్యావిధానంలో సంస్కరణలు అవసరం

  • సర్కారీ విద్య వైఫల్యంపై ఆలోచించాలి

  • ఒక్కో విద్యార్థికి రూ.1.08 లక్షలు ఖర్చు

  • రాష్ట్రంలో 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఏవీఎన్‌ లేక్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ స్కూల్‌ ప్రారంభం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ఇబ్రహీంపట్నం)

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సునామీలా వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే ఆందోళన నెలకొందని, దేశంలోని కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సునామీని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని, వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు బదులు బ్లూ కాలర్‌ ఉద్యోగాలు పెంచాలని అన్నారు. విద్యావిధానంలో మార్పులు తేవాలని, ఉపాధి కల్పించే దిశగా నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. ఇందుకు ఇప్పటినుంచే దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో ఆకలి చావులు, నిరక్ష్యరాస్యత అధికంగా ఉండడంతో ఆనాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ముందుచూపుతో మంచి ప్రణాళికలు రచించి వాటిని అమల్లోకి తీసుకువచ్చారని చెప్పారు. దీని పర్యవసానంగానే ఇప్పుడు దేశంలో అన్ని చోట్లా విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని, అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులనూ ఆనాడే నిర్మించారని, దీంతో కోట్లాది ఎకరాల భూములు సాగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఆహార ధాన్యాలు ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి దేశం చేరుకుందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్‌ లేక్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ స్కూల్‌ ప్రారంభోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడుతూ.. పేదరికం, వెనకబాటుతనం పోవాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. కొందరికి భూములు ఉన్నప్పటికీ వెనకబాటుతనంతోనే ఉన్నారని, దీనికి కారణం చదువు లేకపోవడమేనని తెలిపారు. పేదరికంలో ఉన్నవారు చదువుకుని వెనుకబాటుతనం నుంచి బయటపడుతున్నారని చెప్పారు. చదువు మంచి జీవితాన్ని, గుర్తింపును ఇస్తుందన్నారు.


ఒక్కో విద్యార్థికి రూ.1.08 లక్షల ఖర్చు..

ప్రభుత్వ విద్యాసంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రజా ప్రతినిధులంతా ఆలోచించాలని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం విద్య కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా.. ఆ మేర ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రతి ఏటా రాష్ట్రంలో 1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులవుతున్నారు. కానీ, వీరిలో ఎంత మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి? వారు చదువుకున్న సర్టిఫికెట్‌కు, ఉద్యోగానికి సంబంధం ఉంటుందా? అనేది చూస్తే ఆందోళన కలుగుతోంది. నాణ్యమైన విద్య అందించకపోవడమే దీనికి కారణం’’ అని సీఎం అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే ఒక్కో విద్యార్థి కోసం ప్రభుత్వం ఏటా రూ 1.08 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇటీవల ఒక సర్వేలో ఆరో తరగతి చదివే విద్యార్థులు మూడో తరతగతి పుస్తకాలు కూడా చదవలేకపోతున్నట్లు తేలిందన్నారు. 9 మంది పిల్లలు ఉన్నచోట ఐదుగురు టీచర్లు పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 26 వేల స్కూళ్లలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 33 లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. ‘‘ప్రభుత్వ విద్యావిధానంలో, ప్రైవేటు విద్యావిధానంలో ఎందుకు మార్పు ఉంది? పేదలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చదివించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థలోని లోపాలు అత్యంత ప్రమాదకరమని, వీటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.


100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు..

ఫ్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని సీఎం తెలిపారు. విద్యపై రాష్ట్ర బడ్జెట్‌లో 8.3 శాతం నిధులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 స్కూళ్ల నిర్మాణాలు మొదలు పెట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. బ్రేక్‌ ఫాస్ట్‌, భోజనం కూడా పెడతామన్నారు. అలాగే రేషనలైజేషన్‌ ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని, కనీసం 30 మంది విదార్థులకు తరగతి ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 2034 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు ఫ్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏవీఎన్‌ లేక్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ స్కూల్‌ అద్భుతంగా ఉందని సీఎం ప్రశంసించారు. జిల్లా అధికారులు ఒకసారి ఇక్కడకు వచ్చి దీనిని పరిశీలించి యంగ్‌ ఇండియా స్కూళ్ల నిర్మాణాల్లో అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.

విద్య కోసం విదేశాలకు వద్దు: కిషన్‌రెడ్డి

విద్య కోసం ఇక్కడి విద్యార్థులెవరూ భారీగా ఖర్చు పెట్టి ఇబ్బందులు పడుతూ విదేశాలకు వెళ్లవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా నూతన విద్యావిధానాలు అమల్లోకి వచ్చాయని, ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. అనేక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికే వస్తున్నారని చెప్పారు. విదేశాలకు డాక్టర్‌ చదివేందుకు వెళుతున్నవారు తిరిగి ఇక్కడకు వస్తే.. వారికి మళ్లీ మనమే అన్నీ నేర్పాల్సి వస్తోందన్నారు. డాక్టర్‌, ఇంజనీరింగ్‌ చదివేందుకు ఇక్కడ అనేక అవకాశాలున్నాయని, అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, దీంతో సీట్లు పెరుగుతున్నాయని వివరించారు. విద్యా, వైద్యం అందించాలనే తపనతో ప్రణాళిక బద్ధంగా సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘనందన్‌రావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి స్వాగతం పలికారు.

Updated Date - Apr 04 , 2026 | 05:30 AM