ఫాంహౌస్‌లోని పశుపతిని బయటకు రానివ్వొద్దు
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:51 AM
సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటివారని, ఫాంహౌస్‌లో బంధించిన ఆ పశుపతిని మళ్లీ బయటకు రానివ్వొద్దని అన్నారు.
చిన్నపిల్లలనూ తాగుబోతులను చేసిన ఘనత ఆయనదే
నన్ను రాజీనామా చేయమనడానికి మీ అయ్య జాగీరా?
కేసీఆర్ చేసిన తప్పులు మా ప్రభుత్వం ఎప్పటికీ చేయదు
ఈ సర్కార్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉంది
9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు.. అధికారం వారికి కలే
రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
చందన్‌వెల్లి డేటా సెంటర్‌ను త్వరగా ప్రారంభించండి
సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధపై మరింత దృష్టి పెట్టండి
భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు సీఎం సూచన
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటివారని, ఫాంహౌస్‌లో బంధించిన ఆ పశుపతిని మళ్లీ బయటకు రానివ్వొద్దని అన్నారు. పాపాల భైరవుడిని ఫాంహౌస్ కే పరిమితం చేయాలని వ్యాఖ్యానించారు. మంగళవారం రైతుభరోసా నిధుల విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘కేసీఆర్ చెప్పిన కాశీ మజిలీ కథలు విన్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓడించి ఫాంహౌస్‌కు పరిమితం చేశారు. ఇప్పుడు చిన్న రాక్షసులు కేటీఆర్, హరీశ్‌రావు బయలుదేరి ఊరూరా తిరుగుతూ.. కేసీఆర్ మళ్లీ రావాలని, ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటాడు. ఎవరినీ ప్రశాంతంగా సంసారం కూడా చేసుకోనివ్వడు. పెళ్లాం మొగుడు మాట్లాడుకునే మాటలు వినటానికి సిగ్గుండాలి. తాను, తన భర్త మాట్లాడుకునే మాటలు కూడా విన్నారంటూ సొంత బిడ్డ కూడా చెప్పింది.
ఇంకా ఆ బతుకు ఎందుకు? ఎండ్రీన్ తాగి బావిలో పడి చచ్చిపోయినా తప్పులేదు’’ అని సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని సంస్కృతులు నాశనమయ్యాయని, తాగుడు సంస్కృతిని మాత్రమే అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబజార్‌లు తెస్తే.. కేసీఆర్ బెల్టు బజార్‌లు తెచ్చారని ఆరోపించారు. చిన్న పిల్లలను కూడా తాగుబోతులుగా తయారుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకరిని మించి మరొకరు అబద్ధాలు చెబుతున్నారని, ఈ విషయంలో వారు కేసీఆర్‌ను మించిపోతున్నారని తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావు మాటలను ప్రజలు నమ్మరన్నారు.
కేసీఆర్ మళ్లీ వస్తే ఏవీ ఇవ్వరు..
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రుణమాఫీ చేయరని, ధాన్యం సహా ఇతర ఏ పంట ఉత్పత్తులనూ కొనరని, రైతులతో సహా ఎవరికీ ఏమీ ఇవ్వరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి తప్పులను తమ ప్రభుత్వం చేయదని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్, రెండో దశ మెట్రో, రీజినల్ రింగురోడ్డు లాంటి పనులు చేద్దామన్నా, 5వేల పోలీస్ ఉద్యోగాలు ఇద్దామన్నా కేసీఆర్ కుటుంబం వద్దంటోందని తెలిపారు. అయితే బీఆర్‌ఎస్ నేతలు పొర్లుదండాలు పెట్టినా ఈ అభివృద్ధి పనులు ఆపేదిలేదని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలని, రాజీనామా చేయాలని నన్ను డిమాండ్ చేస్తున్నారు. మీరు అనగానే దిగిపోవడానికి ఇది మీ అయ్య జాగీరా? మీ తాత జాగీరా?’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్‌కు అప్పగిస్తే రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక తవ్వినకొద్దీ అప్పులు, తప్పులు కూడా బయటపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వాయిదా పద్ధతిలో నెలంతా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పారు. బడిపిల్లలకు పండ్లు, పాలు, కూరగాయలు, కాస్మొటిక్ బిల్లులు కూడా కేసీఆర్ చెల్లించలేదన్నారు. సర్పంచులకు బకాయిలు పెడితే ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బిల్లుల కోసం ధర్నాలు చేశారని పేర్కొన్నారు.
తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం..
ప్రజాప్రభుత్వం ఏర్పడిన 30 నెలల్లో సమాజంలో గౌరవం పెంచుకొని, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదివరకు ఢిల్లీకి పోతే పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీలో పరపతి పెరిగిందని తెలిపారు. 25.30 లక్షల మంది రైతులకు రూ. 20,671 కోట్ల రుణమాఫీ చేశామని, రైతుభరోసాలో కేసీఆర్ ఎగ్గొట్టిన రూ.7 వేల కోట్లు జమ చేశామని, పౌరసరఫరాల సంస్థలో బకాయులు చెల్లించామని సీఎం వివరించారు. రైతుభరోసాను ఏడాదికి రూ.12 వేలకు పెంచి ఇప్పటికే రూ.27 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ సీజన్‌తో కలిపితే ఇవి రూ.36 వేల కోట్లకు చేరతాయని తెలిపారు. ఉచిత కరెంటుకు పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనని, వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత కరెంటు ఇవ్వటంతోపాటు విద్యుత్ బకాయిలు రద్దుచేశారని రేవంత్ గుర్తు చేశారు. కాస్త కష్టమైనా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా.. వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని పేర్కొన్నారు. 30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు..
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి ప్రభుత్వం తమదే అంటున్నారని, కానీ.. తెలంగాణలో ఆ పార్టీ వచ్చేది లేదని సీఎం రేవంత్ అన్నారు. ఇక్కడ వారి ఆటలు సాగవన్నారు. ప్రతి పేదవాడి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని ప్రధాని మోదీ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, ఆ లెక్కన 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అని నిలదీశారు. తెలంగాణలో బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. ‘‘నాకు ఈ పదవి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ, ఎన్‌టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలకే పదవి శాశ్వతం కాలేదు. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపను. వజ్ర వైడూర్యాలు సంపాదించాలని, కిరీటాలు పెట్టుకోవాలని నాకు కోరిక లేదు. మాట శాశ్వతం. మాట కోసం ఎంతకైనా నిలబడతాడనే పేరు నాకొస్తే చాలు. అంతకుమించి ఏమీ అక్కర్లేదు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, నగదు సిద్ధం చేశామని ప్రకటించారు. రైతులు కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈసారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని అన్నారు. వరి సాగు ఒక్కటే శ్రేయస్కరం కాదన్నారు.
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
రైతు భరోసా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పదేళ్ల పాటు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్‌ఎ్‌సకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శిల్పకళా వేదికలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు అనాలోచిత నిర్ణయాలతో చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తాము మోస్తున్నామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆ అప్పులకు సంబంధించి రూ.2,08,557 కోట్లను బ్యాంకుల వడ్డీలు, అసలు చెల్లింపులకు ఖర్చు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రైతుల కోసం రూ.2,88,670 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అంటే ఏడాదికి రూ.30,364 కోట్లు కాగా, తమ ప్రభుత్వం రూ.1,56,496 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఆర్థికంగా ఎన్ని చిక్కులున్నా, వెనకడుగు వేయకుండా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతు భరోసాను నిరంతరాయంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసం: మంత్రి తుమ్మల
రైతు భరోసా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంచేసి, విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్తోందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు దేశవ్యాప్తంగా రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేస్తే... తమ ప్రభుత్వం ఒకేసారి రూ. 21 వేల కోట్ల రుణమాఫీని గుండెఽ ధైర్యంతో అమలు చేసిందని తెలిపారు. రైతుభరోసా పథకంలో గత యాసంగి సీజన్‌లో మాత్రమే రూ. 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని అంగీకరించారు. దానికి బదులుగా రూ. 5 వేల కోట్లతో రైతులు పండించిన పంటలు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. రైతుబీమా పథకం కోసం ఎల్‌ఐసీకి రూ. 4,250 కోట్ల ప్రీమియం చెల్లించినట్లు తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకాల వరిసాగుకు, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.
తుమ్మల- భట్టి చేతులు కలిపిన సీఎం: సభలో ఆసక్తికర పరిణామం
రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రైతుల ఖాతాల్లో నిధుల బదిలీ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు సీఎం రేవంత్ వద్దకు ఒక లాప్‌టా్‌పను తీసుకురాగా, సీఎం లాంఛనంగా నిధులు విడుదల చేశారు. ఆ సమయంలో సీఎంకు ఓవైపు తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపున భట్టి విక్రమార్క నిలబడి ఉన్నారు. నిధుల విడుదల విజయవంతంగా పూర్తికావడంతో మంత్రి తుమ్మల సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అదే సమయంలో సీఎం రేవంత్.. తుమ్మల చేతిని పక్కనే ఉన్న భట్టి విక్రమార్క చేతిలో పెట్టి, గట్టిగా షేక్‌హ్యాండ్ ఇప్పించారు. ఖమ్మం జిల్లా రాజకీయ నేపథ్యంలో.. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలను ఇలా బహిరంగ వేదికపై నవ్వుతూ చేతులు కలిపించడం సభలో ఉన్నవారిని ఆకట్టుకుంది.