రైతుభరోసా విడుదల
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:30 AM
యాసంగి పంటసాగుకు సంబంధించిన రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం...
నర్మెట్ట రైతు ఉత్సవాల్లో మీట నొక్కిన సీఎం రేవంత్
నేడు రైతుల ఖాతాల్లో నిధుల జమ
తొలి విడతగా 70 లక్షల మందికి రూ.3600 కోటు
సిద్దిపేట/హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగి పంటసాగుకు సంబంధించిన రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం రైతు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం.. ఈ సందర్భంగా సభావేదికపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, దామోదర రాజనర్సింహతో కలిసి ల్యాప్‌టా్‌పలో రైతుభరోసా నిధుల విడుదలకు సంబంధించిన బటన్ నొక్కారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన మాటప్రకారం ప్రతి సీజన్‌లో రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. క్రితంసారి 9రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తుచేశారు. ఈసారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు విడతలుగా రైతుభరోసా సహాయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తొలివిడతగా రూ.3600 కోట్లు, మరో 20 రోజుల్లోగా రూ.2700 కోట్లు, ఆ తర్వాత 20 రోజులకు రూ.2700 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు. మొత్తంగా 45 రోజుల్లోపు రూ.9 వేల కోట్లు రైతులందరికీ అందుతాయన్నారు. రుణమాఫీ, రైతుభరోసా, వరిపంటకు బోనస్ విషయంలో రైతులకు లోటు లేకుండా చూసుకున్నామని చెప్పారు. సిద్దిపేట గడ్డపై నుంచి 70లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. కాగా, రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 68.89 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని, మొత్తం రూ.3,446.94 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వ విభాగాలు పేర్కొన్నాయి.