Share News

రాహుల్‌గాంధీతో రేవంత్‌ రెడ్డి భేటీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:29 AM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు.

రాహుల్‌గాంధీతో రేవంత్‌ రెడ్డి భేటీ

  • మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణపై రాహుల్‌ ఆరా!

న్యూఢిల్లీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తుగ్లక్‌ రోడ్డులోని రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లిన రేవంత్‌.. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన పలు కీలక రాజకీయ, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రగతి, స్కిల్‌ యూనివర్సిటీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని రాహుల్‌ గాంధీకి రేవంత్‌రెడ్డి వివరించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్కిల్‌ యూనివర్సిటీ’ ఏర్పాటు, దాని పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలను సీఎం ప్రత్యేకంగా వివరించగా.. రాహుల్‌ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణకు గురైన ఉదంతంపై రాహుల్‌ గాంధీ ఈ సమావేశంలో ఆరా తీసినట్లు సమాచారం. దీనికి గల సాంకేతిక, ఇతర కారణాలను రేవంత్‌ రెడ్డి ఆయనకు వివరించినట్లు తెలిసింది.

Updated Date - Jun 13 , 2026 | 05:31 AM