నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్
ABN , Publish Date - May 08 , 2026 | 07:02 AM
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి..
ఆలయాలు, ఆస్పత్రి నిర్మాణాలకు శంకుస్థాపనలు
కొడంగల్, మే 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 110 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నియోజకవర్గంలోని మరో రెండు ఆలయాలు, ఓ ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. శ్రీవేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు రూ. 2.25 కోట్లతో చేపట్టిన దౌల్తాబాద్ శ్రీవేంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణం, రూ. 2 కోట్లతో చేపట్టిన కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం, రూ. 255 కోట్లతో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి సీఎం వర్చువల్‌గా శంకుస్థాపనలు చేస్తారు. సీఎం రేవంత్ శుక్రవారం ఉదయం 11 గంటలకు కొడంగల్‌కు చేరుకొని మొదట శ్రీవేంకటేశ్వరస్వామి బాలాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, ఇక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీనివా్‌సరాజు, కలెక్టర్ దీపక్‌తివారి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి తదితరులు గురువారం పర్యవేక్షించారు.