వివక్ష చూపను
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:28 AM
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై తనకు ఎలాంటి వివక్షా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తానన్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలనూ అభివృద్ధి చేస్తాం
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకూ సమానంగా నిధులిచ్చాం
పదేళ్లలో కొడంగల్‌కు ఎన్ని ఇచ్చారో చర్చ పెడదామా!
2029లోనూ అధికారం మాదే.. ఎవరు అడ్డుకున్నా ఆగదు
సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి
రైతులు వరే కాదు.. అన్ని పంటలనూ సాగుచేయాలి
50 లక్షల టన్నులకు మించి ధాన్యాన్ని కేంద్రం కొనట్లేదు
తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపవద్దు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన టీచర్లున్నారు
రామగుండం ఎరువులను పూర్తిగా తెలంగాణ
రైతులే వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి
నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంలో సీఎం రేవంత్
రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే నా తపన. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 28 నెలల్లోనే రూ.1.40 లక్షల కోట్ల నిధులను రైతుల కోసం ఖర్చు చేశాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ప్రతినెలా రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. మేం ప్రతినెలా రూ.5500 కోట్ల చొప్పున వెచ్చించాం. దేశంలోనే అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
- సీఎం రేవంత్‌రెడ్డి
సిద్దిపేట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై తనకు ఎలాంటి వివక్షా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తానన్నారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్‌కు ఎన్ని నిధులిచ్చారో, తాము అధికారంలోకి వచ్చాక గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు ఎన్ని నిధులిచ్చామో చర్చిద్దాం రావాలని బీఆర్‌ఎ్‌సకు సవాల్ చేశారు. ‘‘పదేళ్లు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. పదేళ్లు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎవరు అడ్డుకున్నా ఆగదు. 2029లో మళ్లీ మాదే అధికారం’’ అని ప్రకటించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రూ.300 కోట్లతో నిర్మించిన పామాయిల్ కర్మాగారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దీంతోపాటు రూ.50 కోట్లతో ఏర్పాటు చేయనున్న రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో ఒకే కుటుంబం వారికి అవకాశం కల్పిస్తున్నారని, మార్పు చేస్తే మంచి జరుగుతుందో లేదో చూడండని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహకు, వివేక్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటపై తమకు ఎలాంటి వివక్ష లేదని, అధికారులు కూడా నిధుల విషయంలో పూర్తిగా సహకరించాలని అన్నారు. వివక్ష ఉంటే ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీని కట్టించేవాళ్లం కాదని, దానిని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడినని చెప్పారు. ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం ఫ్యాక్టరీ కట్టలేదని, రైతుల కోసం నిర్మించామని స్పష్టం చేశారు.
రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు..
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండలేవని సీఎం రేవంత్ అన్నారు. రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే తన తపన అని చెప్పారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 28 నెలల్లోనే రూ.లక్షా 40 వేల కోట్ల నిధులను రైతుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ప్రతినెలా రూ.2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. తాము 28నెలల్లో ప్రతినెలా రూ.5500 కోట్ల చొప్పున రైతు సంక్షేమం కోసం వెచ్చించామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. కానీ, వరిపంట సాగు చేయడం వల్ల రైతులకు ఆశించిన లాభాలు ఉండవని, పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వరి ఒక్కటే కాకుండా అన్ని రకాల పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. రైతులు పండించే ప్రత్యామ్నాయ పంటలకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 3లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు చేస్తున్నారని, దీనిని 10లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఇతర దేశాల నుంచి నిత్యావసరాలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేకుండా ఇక్కడి అవసరాలను ఇక్కడే తీర్చుకునేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలన్నారు. ‘ప్రతి పంటనూ లాభసాటిగా మార్చడమేబంగారు తెలంగాణ’ అని అన్నారు.
అంకాపూర్ రైతులే ఆదర్శం..
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వానికి అంకాపూర్ గ్రామ రైతులే ఆదర్శమని సీఎం అన్నారు. అక్కడి రైతులు మిగిలిన వారికి విభిన్నంగా పసుపు పండించి ఆర్థికంగా బలోపేతమయ్యారని చెప్పారు. ఇక రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు ఉన్నారని, వీరి సంఖ్యను కోటికి పెంచేలా కృషి చేస్తామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా నిలబడాలని, వారి కోసం ఎక్కడి నుంచైనా నిధులు తెస్తానని, ఇప్పటికే రూ.57 వేల కోట్ల రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించి ఆర్థికంగా నష్టపోవద్దని, నిష్టాతులైన ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారని చెప్పారు. ఇంజనీరింగ్, డాక్టర్ చదువుల కంటే పాలిటెక్నిక్, ఐటీఐ చదివిన వారికి ఉద్యోగాలు త్వరగా వస్తున్నాయని, అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్య బోధన చేయిస్తున్నామని వివరించారు.
ఎరువుల కొరత రావొచ్చు
దేశాల మధ్య జరిగే యుద్ధం వల్ల యూరియా, ఎరువుల కొరత వచ్చే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అందుకే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలోని ఎరువులను పూర్తిగా తెలంగాణలోని రైతులకే వినియోగించుకునేలా కేంద్రం ప్రకటన చేయాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల సహకారం అవసరమన్నారు. వారు ప్రధాని మోదీని కలిసి దీనిపై చర్చించాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయాల్లో సమన్వయంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని పెద్దరైతు పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, రైతు బిడ్డగా, రైతుల కళ్లలో ఆనందం కోసమే రేవంత్‌రెడ్డి తపిస్తుంటారని చెప్పారు. కొంతమంది అధికారం కోసం గోతికాడి నక్కల్లా చూస్తున్నారని, వారికి రైతులే తగిన బుద్ధి చెబుతారన్నారు. యూరియా కొరత సమయంలో రైతుల బాధలు, వారి చెప్పులు చూసి సంతోషపడిన ఘనత ప్రతిపక్ష పార్టీలదని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కారుకూతలు మానుకోవాలన్నారు. తెల్లకాగితాన్ని నల్లగా మార్చడం తప్ప పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో బీఆర్‌ఎస్ పాత్ర ఏమీ లేదన్నారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
సిద్దిపేట కలెక్టరేట్/నంగునూరు: నర్మెట్టలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా రూ.141.34 కోట్లతో సిద్దిపేట మునిసిపాలిటీలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ నగర్‌లో రూ.1.43 కోట్లతో నిర్మించిన యూపీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభించారు. ఎన్సాన్‌పల్లిలో రూ.78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనం, రూ.15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రి, రూ.3.60 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను, నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ.1.43 కోట్లతో పీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు, రూ.16.62 కోట్లతో మర్కూక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అదనపు మౌలిక సదుపాయాలకు, రూ.8.65 కోట్లతో సమీకృత మండల కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. రూ.9.65 కోట్లతో జగదేవ్‌పూర్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు.