ఆ తల్లుల స్ఫూర్తితోనే ప్రజాప్రభుత్వం ఏర్పడింది
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:33 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా....
మహాజాతరను వైభవంగా జరుపుకోండి: సీఎం రేవంత్
రాష్ట్ర ప్రజలకు సీఎం మేడారం జాతర శుభాకాంక్షలు
తెలంగాణ ధిక్కారానికి ఆదివాసీ దేవతలు ప్రతీకలు: కేసీఆర్
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వనదేవతల మహోత్సవంగా జరుపుకోవాలన్నారు. మేడారం తల్లుల స్ఫూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. జనం కోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం తల్లుల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తల్లుల చెంత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజాప్రభుత్వం పునర్నిర్మించిందని చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాల పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందన్నారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం రేవంత్ ఫోన్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు సహకరించాలని కోరారు. అలాగే అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి మహాజాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు కేసీఆర్ జాతర శుభాకాంక్షలు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క, సారలమ్మ ప్రతీకలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని, సమ్మక్క, సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.