50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి అన్యాయం
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:18 AM
పునర్విభజనలో భాగంగా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్‌సభ సీట్లను గంపగుత్తగా 50శాతం మేర పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నూటికి నూరు శాతం అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
మెజారిటీ కోసమే ఇలాంటి ప్రయత్నం..
దక్షిణాది కోసం లక్ష్మణ్ రాజీనామా చేసి పోరాడాలి
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పునర్విభజనలో భాగంగా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్‌సభ సీట్లను గంపగుత్తగా 50శాతం మేర పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు నూటికి నూరు శాతం అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటూ రాకపోయినా.. గుజరాత్, బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఆరేడు ఉత్తరాధి రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. 50 శాతం పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండబోదన్నారు. ‘‘ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్ సభ సీట్లు ఉండగా.. 50శాతం పెంచితే 195 అవుతాయి. అదే తీరులో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 413 నుంచి 620 వరకు పెరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్లలో తేడా 283గా ఉంటే.. పెంపు తర్వాత ఈ తేడా 407కు చేరుకుంటుంది. అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లోని 195 సీట్లలో ఒక్క సీటు రాకున్నా... గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయవచ్చు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు అవసరమే లేకుంటే బండి సంజయ్ వంటి వారికి ఇప్పుడిచ్చిన సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వరు’’ అని వ్యాఖ్యానించారు. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల పౌరులు.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుతారని అన్నారు. ఇది క్రూరమైన మెజారిటీ కోసం జరుగతున్న ప్రయత్నమని అభివర్ణించారు. దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక, రాజకీయ పరమైన అంతరం నియంతృత్వానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ సీమాంధ్రకే మెజారిటీ అసెంబ్లీ స్థానాలు ఉండేవని, అందుకే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్ల సంఖ్య విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం అలాగే కొనసాగిస్తూ పునర్విభజన జరగాలని అభిప్రాయపడ్డారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో తిరిగి వస్తున్నది 41 శాతమేనని, సెస్సుల నుంచి అణా పైసా కూడా రావడం లేదని ఆరోపించారు. జమిలి ఎన్నికలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వితండ వాదం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కాల పరిమితి పూర్తయ్యాక జమిలి ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. బీజేపీ నేత లక్ష్మణ్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి దక్షిణ భారత ప్రజల కోసం పోరాటం చేయాలని సూచించారు.