CM Revanth Reddy: జిల్లాల హేతుబద్ధీకరణకు
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:52 AM
గత పాలకులు రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు
పునర్‌వ్యవస్థీకరణ డిమాండ్లపై అధ్యయనం
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది
ఆరు నెలల్లో నివేదిక తీసుకుని హేతుబద్ధీకరణ చేస్తాం
జిల్లాలు, మండలాలను పెంచం, తగ్గించం.. పేర్లను మార్చం
టీజీవో డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్ర జ్యోతి): గత పాలకులు రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటిని హేతుబద్ధీకరించాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసేదుకు త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి.. జిల్లాలు, మండలాల హేతుబద్ధీకరణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని, సలహాలు, సూచనలు తీసుకుంటుందని చెప్పారు. ఆరు నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక.. దానిపై బడ్జెట్ సమావేశాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలతో కూలంకుషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో)- 2026 డైరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు మండలాలు, జిల్లాల విభజనలో నచ్చితే నజరానాఅన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో ఒకే నియోజకవర్గం ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. కమిషన్ ద్వారా మండలాలు, జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దుతామన్నారు. మండలాలు, జిల్లాలను పెంచడం, తగ్గించడం చేయబోమని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల ఎక్కువ జనాభా, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉందని, ఇలాంటి వాటిని సరిచేస్తామని ప్రకటించారు.
రాజకీయ నిర్ణయాలతో అన్యాయం జరుగుతుందనే..
ఒక నగరంగా కలిసి ఉన్న వరంగల్‌ను రెండు జిల్లాలు చేశారని, దానిని కలపాలంటూ ప్రజల నుంచి డిమాండ్ ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ తరహా అభ్యంతరాలన్నింటిపై కమిషన్ అధ్యయనం చేస్తుందన్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే మరోసారి అన్యాయం జరుగుతుందనే.. జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సైబరాబాద్ పేర్లను తమ ప్రభుత్వం పెట్టలేదని, ఇవన్నీ గతంలో ఉన్న పేర్లేనని గుర్తు చేశారు. సికింద్రాబాద్ పేరును తొలగించామంటూ కొందరు విమర్శిస్తున్నారని, తాము ఎక్కడా తొలగించలేదని స్పష్టం చేశారు. గతంలో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. ఒక్క రాచకొండ పేరును మాత్రమే దొరల చిహ్నంగా ఉంటుందనే ఉద్దేశంతో మార్చి.. కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో కొంత భాగాన్ని కలిపామని చెప్పారు. మండలాల్లో జనాభా సమానంగా ఉండేలా చూడడంతోపాటు జిల్లాల జనాభాలో సమతుల్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల పేర్లను మారుస్తున్నామనే అపోహలను నమ్మవద్దన్నారు. ఉద్యోగులు మంచి సచివాలయం నిర్మించుకుని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు మంచి పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందన్నారు.
సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది..
‘‘మీరు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని కొందరు అంటున్నారు. మనందరం కుటుంబ సభ్యులం. కుటుంబంలో కుమ్మక్కులు ఏముంటాయి? నిర్ణయాలు మేం తీసుకుంటే అమలు చేసేది ఉద్యోగులే. సరిపోని వారు, అసూయపడే వారు, కడుపులో విషం ఉండేవారు, కళ్లలో ద్వేషాన్ని నింపుకొని మనవైపు చూసేవారు ఎప్పుడూ ఉంటారు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో కూర్చుని.. మారీచుడి లాంటి వాళ్లను సభకు పంపుతున్నారు. రాక్షసులు దేవతల యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నాటి దేవతల కాలం నుంచి నేటి ప్రజాస్వామ్యం వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాళ్ల మాటలను అర్థం చేసుకుని సమయస్ఫూర్తితో ముందుకు వెళదాం. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది’’ అని ఉద్యోగులనుద్దేశించి సీఎం అన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడం వల్ల.. పదవీ విరమణ చేసే ఉద్యోగులు పెరిగారని తెలిపారు. గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల భారాన్ని పెట్టిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు, ప్రభుత్వానికి సరఫరా చేసిన వారి బిల్లులు రూ.42 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఇక సింగరేణి బొగ్గు కొనుగోలు చేసి.. రైతులకు విద్యుత్తు ఉచితంగా ఇచ్చి.. కార్పొరేషన్లకు దాదాపు రూ.1,11,000 కోట్ల బకాయిలు పెట్టారని వెల్లడించారు. అప్పులు, తప్పులను తాము చట్టసభలో చర్చకు పెట్టామని, బకాయిలన్నీ లెక్కగట్టి ప్రభుత్వంపై రూ.8,10,000 కోట్ల అప్పుల భారం ఉన్నట్లు తేల్చామని వివరించారు.
నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయమే..
జీతాలు, పింఛన్లు, అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, అన్నీ లెక్కలు వేస్తే.. నెలకు రూ.30 వేల కోట్ల అవసరం ఉన్నట్లు తేలిందని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం నెలకు రూ.18 వేల కోట్లేనన్నారు. దీనిని సర్దుబాటు చేసే క్రమంలో ఉద్యోగుల బకాయిలు సకాలంలో చెల్లించలేకపోయామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నడిపేది 200 మంది ప్రజాప్రతినిధులు కాదని, పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా అని స్పష్టం చేశారు. మారింది ముఖ్యమంత్రి, 15 మంది మంత్రులేనని, మిగిలినవారు పాతవారేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చేది ఉద్యోగులేనని కొనియాడారు. ‘‘సోదరుడిగా మీ దగ్గరకు వచ్చా.. సమస్యలు, అప్పులు.. బాధ్యతగా నెరవేర్చడానికే పని చేస్తున్నా. గతంలో జీతాలు ఎప్పుడిచ్చారు, ఇప్పుడు ఏ తారీకు ఇస్తున్నామో బేరీజు వేసుకోవాలి’’ అని సీఎం అన్నారు. డైరీ ఆవిష్కరణ అని ఉద్యోగులు భావించినా.. కుటుంబ పెద్దగా తీపికబురు చెప్పాలనే ఉద్దేశంతో డీఏపై సంతకం పెట్టి వచ్చానన్నారు. ఒక డీఏ వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.227 కోట్ల భారం పడుతుందని తెలిపారు.