యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు
ABN , Publish Date - May 11 , 2026 | 05:43 AM
ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం (2026-27) యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది వరకు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనానికి సాంకేతిక
సమస్యలు.. క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సిన అవసరం
విద్యాసంవత్సరం ప్రారంభానికి తక్కువగా ఉన్న సమయం
విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విలీనం వాయిదా
విస్తృత సంప్రదింపులు.. అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం
అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
సాంకేతిక సమస్యలపై ఇప్పుడు చెబుతారా?
ఆ కాలేజీలకు భయపడుతున్నారా? అంటూ ఆగ్రహం!
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఇంటర్ విద్య జేఏసీ
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం (2026-27) యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండటం, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నందున విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్ఈ మాదిరిగా పాఠశాలల్లోనే 11వ, 12వ తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపవుట్‌ల సంఖ్య తగ్గుతుందని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈతోపాటు అత్యధిక రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. పదో తరగతితోనే చదువు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలను నిలిపివేస్తూ అధికారులు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. అయితే విద్యా సంవత్సరం సమీపిస్తున్న దశలో ప్రవేశాలను నిలిపివేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ను విద్యాశాఖలో విలీనం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, ఇది పలు సాంకేతిక సమస్యలతో ముడిపడి ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ సమస్యలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున దీనిని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
సీఎం నిర్ణయంపై ఇంటర్ విద్య జేఏసీ హర్షం
ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఈ ఏడాది యథావిధిగా కొనసాగించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల పట్ల ఇంటర్ విద్య జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్‌లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన తగ్గిందని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం తెలిపింది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ పేర్కొన్నారు.
సాంకేతిక సమస్యలున్నాయని ఇప్పుడు చెబుతారా?
ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, ఇందుకు పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యా కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియను త్వరగా చేపట్టాలని చెబుతున్నా.. ఇంతవరకూ చేయకపోవడమేంటని, పైగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్యల గురించి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించినట్లు సమాచారం. ‘‘విద్యా కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి చెప్తున్నా. అయినా మీరు ఆ దిశగా చర్యలు పూర్తిచేయలేదు. ఇప్పుడేమో సాధ్యం కాదంటూ సాంకేతిక సమస్యలు చెప్తున్నారు. ఆ కాలేజీల వాళ్లకేమైనా భయపడుతున్నారా? వాళ్ల కోసం పనిచేస్తున్నారా? సాంకేతిక సమస్యలు నాకు ఇప్పుడు చెప్పి.. సాధ్యం కాదంటున్నారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న నాకే మీరు ఇన్ని కారణాలు చెప్తున్నారంటే మీ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది’’ అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేవలం విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఒక్క ఏడాదికి ఇంటర్ బోర్డు కొనసాగేందుకు అవకాశం ఇస్తున్నానని చెప్పినట్లు సమాచారం.
నేటి నుంచి విద్యా వారోత్సవాలు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం సోమవారం నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాలను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. హైదరాబాద్ పరిధిలోని (క్యూర్) పాఠశాలల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలను ఈ సందర్భంగా సీఎం ప్రకటించనున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలను భాగస్వామ్యం చేయనున్నారు. బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.