Share News

ఆ రైతులను ఆదుకోండి.. సీఎం ఆదేశం

ABN , Publish Date - May 01 , 2026 | 05:17 AM

నిర్మల్‌ జిల్లా పెంబి లోని మొక్కజొన్న పంట పొలాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని ...

ఆ రైతులను ఆదుకోండి.. సీఎం ఆదేశం

  • మొక్కజొన్న పంట కాలిపోయిన బాధిత రైతులకు సాయం కోసం నివేదిక తయారీలో అధికారులు

  • మరో రెండు ఘటనల్లో 15ఎకరాల్లో పంట దగ్ధం

పెంబి, బోథ్‌, రాయికల్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా పెంబి లోని మొక్కజొన్న పంట పొలాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం విద్యుత్‌ శాఖ అధికారు లు ఘటనాస్థలాన్ని సందర్శించారు. షార్ట్‌ సర్క్యూట్‌ అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. బాధిత రైతులకు సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కూడా ఘటన గురించి ఆరా తీశారు. వివరాలు.. మంగళవా రం మధ్యాహ్నం మొక్కజొన్న పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే దాదాపు 10 ఎకరాల మేర పంట కాలిపోయింది. రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు గోస్కుల శ్రీనివాస్‌, ఓడ్నాల ఉమ, కొప్పుల జ్యోతి, గోస్కుల తిరుమల తెలిపారు. ఘటనకు విద్యుదాఘాతమే కారణమని ఆరోపిస్తున్నారు. పొలాల మీదుగా వెళ్లే విద్యుత్‌ తీగలు దిగువకు వేలాడుతున్నాయని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని తెలిపా రు. మరో ఘటనలో... ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం బోథ్‌(బి) శివారులో గురువారం అగ్నిప్రమాదం సంభవించడంతో 13 ఎకరాల్లో జొన్న పంట కాలిపోయింది. బాధిత రైతులు సింగం రమణయ్య, మాధవ్‌ పాటిల్‌, జైనూర్‌ గోవిం దు రూ.10 లక్షలమేర నష్టం వాటిల్లిందని వాపోయారు. జగిత్యాల జిల్లా ఆలియా నాయక్‌ తండాకు చెందిన రైతులు లావుడియా రాజేష్‌, తిరుమల్‌కు చెందిన 1.20 ఎకరాల్లోని, మల్లాపూర్‌ మండలం రేగుంటలో రాజన్నకు చెందిన ఎకరం మొక్కజొన్న పంటకు నిప్పంటుకోవడంతో దగ్ధమైంది.

Updated Date - May 01 , 2026 | 05:17 AM