నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
ABN , Publish Date - May 07 , 2026 | 05:27 AM
తన పర్యటనల సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని, సామాన్య వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగనీయొద్దని..
తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిపివేతపై ముఖ్యమంత్రి ఆగ్రహం
బాధ్యులైన అధికారులపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు
సీఎం పర్యటనల్లో ఇక సింగిల్‌లైన్ విధానం
కమిషనర్లతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, మే6 (ఆంధ్రజ్యోతి): తన పర్యటనల సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని, సామాన్య వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగనీయొద్దని.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు. బుధవారం సీఎం ఢిల్లీ పర్యటన నిమిత్తం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న క్రమంలో భారీ వాహనాలతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలను సైతం ఆపివేయడాన్ని గమనించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, కాన్వాయ్ వెళ్తున్న దారే కాకుండా ఎదురెదురు రోడ్లపైనా వాహనాలను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందని, దీనికి బాధ్యులైన, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలపై సీఎం పదేపదే మాట్లాడటం సమస్య తీవ్రతను తెలియచేస్తోందని, క్షేత్రస్థాయి అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆనంద్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధ్దీకరణకు అదనపు డీజీపీ స్ధాయి అధికారి నేతృత్వంలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇకపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలపకుండా సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం త్వరలో ప్రారంభం కానుండడంతో నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్ధాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌పై అక్రమ పార్కింగ్‌ను నిరోధించాలన్నారు. సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లతో ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుంటూ వీవీఐపీల రాకపోకల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో శాంతిభద్రతల పోలీసులు భాగస్వాములు కావాలన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు సజ్జనార్, డాక్టర్ రమేష్, సుమతి, ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ చందనా దీప్తి, రోడ్ సేఫ్టీ ఐజీ రమేష్ నాయుడు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎ్‌సడీ కమలాసన్ రెడ్డి, సీఎం భద్రతాధికారి చక్రవర్తి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.