అమెరికా రాయబారి విందులో సీఎం
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:08 AM
అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ దేశాధినేతలతో భేటీ
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, వివిధ దేశాల అధినేతలతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలను వారికి వివరించారు. హైదరాబాద్ వేదికగా ఉన్న అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను ప్రస్తావించారు. ఆర్టిఫీషియల్ ఇంజెలిజెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని వివరించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా, పారదర్శకంగా అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో హైదరాబాద్‌ను సందర్శించి ఇక్కడి వ్యాపార అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు. ఈ విందులో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, ఫెడెక్స్ సీఈవో రాజ్ సుబ్రమణియన్, భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ వంటివారు, క్రొయేషియా ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెంకోవిచ్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయెల్ పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా అవకాశమివ్వండి
రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు. గతంలో అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జీహెచ్‌ఎంసీలో కూడా పునరావృతమవుతాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు.