సాధారణ పౌరుడికిచివరి ఆశ కోర్టు
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:03 AM
సాధారణ పౌరుడికి కోర్టు చివరి ఆశ, చివరి ఆశ్రయం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వందకు పైగా ఎకరాల్లో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు భవన సముదాయం దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
దేశంలోనే అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని సకల సౌకర్యాలతో విశాలంగా నిర్మిస్తున్నాం
2027 డిసెంబరు కల్లా పూర్తి
హైకోర్టు జోన్-2 భవన సముదాయాల శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): సాధారణ పౌరుడికి కోర్టు చివరి ఆశ, చివరి ఆశ్రయం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వందకు పైగా ఎకరాల్లో నిర్మించనున్న తెలంగాణ హైకోర్టు భవన సముదాయం దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టినా.. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం తమ ప్రభుత్వానికి దక్కిందని, దీనిని తాము గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న హైకోర్టు జోన్-2 భవన సముదాయాల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. దేశంలోని అగ్రశ్రేణి న్యాయకోవిదులతో కలిసి ఉండటం తనకెంతో గౌరవంగా ఉందని, ఇలాంటిరోజు నాయకుల జీవితంలో చాలా అరుదుగా వస్తుందని అన్నారు. ఒక దేవాల యం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయమని, కానీ.. ఒక కోర్టు సముదాయాన్ని నిర్మించడం, న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడం అన్ని మతాల ప్రజల కోసం ఒక పవిత్ర స్థలా న్ని నిర్మించినట్లేనన్నారు. ‘‘కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం మా ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశం. ఈ కొత్త హైకోర్టు సమాజానికి, ప్ర జాస్వామ్యానికి ప్రతీకగా మారుతుంది. ఇది పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా ఉంటుంది. రాబోయే వందేళ్లపాటు అణగారిన వారు ఈ న్యాయ మందిరానికి వచ్చి తమ వేదనను వినిపించుకుంటారు. ఈ భవనం కేవలం ఒక నిర్మాణం కాదు. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. మా ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవాన్నిస్తుంది. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం కార్యనిర్వాహక విభాగం బా ధ్యతగా మేము భావిస్తున్నాం’’ అని సీఎం వివరించారు.
దేశంలోని అతిపెద్ద భవనాల్లో ఒకటిగా..
తెలంగాణలో నిర్మిస్తున్న హైకోర్టు భవన సముదాయం దేశంలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటిగా, ఆధునిక మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణం గా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు. 2023 డిసెంబరులో తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి అని, ఈ ప్రాజెక్టు కోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించామని తెలిపారు. ఇప్పటి కే జోన్-1లో కోర్టు భవనాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు జోన్-2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. 2027 డిసెంబరు నాటికి అన్ని నిర్మాణాలనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యా ప్తంగా 49 కోర్టుల నిర్మాణం, అనేక నివాస సముదాయాల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘అన్ని వ్యవస్థలు పరస్పర గౌరవంతో కలిసి పనిచేయాలి. విభేదాలను నివారించాలి. మేము కేవలం తీర్పులను మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థ అభిప్రాయాలకు కూడా అత్యున్నత గౌరవం ఇస్తాం. ఈ రోజు హైదరాబాద్‌కు ఒక సుదినం. వచ్చే శతాబ్దం కోసం ఒక అద్భుతమైన నిర్మాణానికి పునాది వేస్తు న్నాం. ఇది ప్రజా జీవితానికి ఒక కీలక స్తంభంగా నిలుస్తుంది. మీ అందరితో కలిసి ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన ‘న్యాయం’ అనే స్ఫూర్తితో మనమందరం ఈ రోజును జరుపుకొందాం’’ అని సీఎం అన్నారు.