Share News

మండలస్థాయికి ‘ప్రజావాణి’

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:23 AM

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో విజయవంతంగా కొనసాగుతున్న...

మండలస్థాయికి ‘ప్రజావాణి’

  • తొలుత రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో.. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడమే లక్ష్యం

  • ప్రతీ అర్జి, ఫిర్యాదు నమోదు చేయాలి

  • నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలి

  • పరిష్కార పురోగతి అర్జీదారుకు తెలియాలి

  • ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్‌, పరిష్కారానికి ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫాం

  • ఆటో ఎస్కలేషన్‌, అవసరమైతే అప్పీలు వ్యవస్థ కూడా

  • అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో విజయవంతంగా కొనసాగుతున్న ‘ప్రజావాణి’ని గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయాలని, కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజావాణి సేవలను మండల స్థాయికి విస్తరించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా వాణిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వాటిని వేగంగా పరిష్కంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (ఎంసీహెచ్‌ఆర్‌డీ) ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రజావాణికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు చేశారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు లేదా జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి ేసవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అందులో భాగంగానే వెంటనే రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తర్వాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజా వాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలిచ్చే ప్రతీ ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్‌, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫాం అభివృద్థి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ ఉండాలని సూచించారు. ప్రతీ స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక స్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్‌ వ్యవస్థను అమలు చేయాలని, అవసరమైతే అప్పీలు వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని సూచించారు.


డ్యాష్‌బోర్డ్‌ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలు

ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి, పెండింగ్‌ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డ్యాష్‌బోర్డ్‌ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ప్రజావాణి సేవల వికేంద్రీకరణతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కిందిస్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి ేసవలు అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 06:45 AM