5 శాతంలోపు ఎక్కువ ధరకు సై!
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:18 AM
హైబ్రిడ్ యాన్యునుటీ మోడ్ (హ్యామ్) రోడ్ల పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. టెండర్లలో నిర్ణీత ధరలకన్నా ఎక్కువ ధరల ప్రస్తావన సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంతో...
హ్యామ్ రోడ్ల పనులకు లైన్ క్లియర్
నేడు లెటర్ ఆఫ్ అవార్డుల జారీ
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యునుటీ మోడ్ (హ్యామ్) రోడ్ల పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. టెండర్లలో నిర్ణీత ధరలకన్నా ఎక్కువ ధరల ప్రస్తావన సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంతో పనుల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. నిర్ణయించిన ధరలకన్నా ఐదుశాతం లోపు ఎక్కువ ధరలకే టెండర్ వేసే అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం సమావేశం నిర్ణయించగా అందుకు కాంట్రాక్టర్లు కూడా సమ్మతించారు. దాంతో హ్యామ్ రోడ్ల పనుల్లో గురువారం కీలక మందడుగు పడనుంది. ఈ మేరకు కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన ఐదు శాతంలోపు ఎక్సెస్ టెండర్లను అంగీకరిస్తున్నట్లుగా ‘లెటర్ ఆఫ్ అవార్డ్’ (ఎల్‌వోఏ)లను ఆర్‌అండ్‌బీ శాఖ గురువారం జారీ చేయనుంది. ఎల్‌వోఏ జారీ అనంతరం 45 రోజుల్లో పనుల నిర్వహణ కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందాలు పూర్తయ్యాక రుణాల కోసం కాంట్రాక్టర్లు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాల్సిరావడంతో రుణం అందేందుకు సుమారు రెండు, మూడు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే రోడ్ల పనుల కోసం ఒప్పందం అయిన రోజు నుంచే సంబంధిత రహదారుల నిర్వహణ కాంట్రాక్టర్లదేనని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఆర్‌అండ్‌బీలో 6,092 కి.మీ రోడ్లను హ్యామ్ విధానంలో రూ.13,006 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రోడ్లను 34 ప్యాకేజీలుగా విభజించగా, వాటిలో ఓ 26 ప్యాకేజీలకు గురువారం లెటర్ ఆఫ్ అవార్డులను జారీ చేయనున్నారు. మరో ఆరు ప్యాకేజీలకు సంబంధించిన ఐదు శాతంలోపు ఎక్సెస్ టెండర్ల కాన్సెంట్‌లను ఓ మూడు కంపెనీలు గురువారం ఆర్‌అండ్‌బీకి అందించనున్నట్లు తెలిసింది. ఈ ఆరు ప్యాకేజీల కోసం సదరు కంపెనీలు ఇచ్చిన కాన్సెంట్‌లను పరిశీలించాక వాటికి అవార్డులు జారీ చేయనున్నారు. కాగా మిగిలిన మరో మూడు ప్యాకేజీల్లో నిర్ణయించిన పనుల కోసం టెండర్ రీ-కాల్ చేయడంతో వాటి సాంకేతక ప్రక్రియ పూర్తయ్యాక ఆ కంపెనీలకు లెటర్ ఆఫ్ అవార్డులు జారీ చేయనున్నట్లు తెలిసింది.