10 రోజుల్లో 1,06,598 ఫైళ్లు క్లియర్
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:53 AM
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణకు విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇరవై రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే దిశగా ....
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’తో సత్ఫలితాలు.. శానిటేషన్ డ్రైవ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్పందన
వార్డు మెంబర్ నుంచి మంత్రి వరకు అందరి భాగస్వామ్యం
హైదరాబాద్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణకు విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇరవై రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపింది. ఈ కార్యక్రమం కింద తొలి పది రోజుల్లోనే (మార్చి 6 నుంచి 15 వరకు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 1,06,598 ఫైళ్లను క్లియర్ చేశామని వెల్లడించింది. 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్‌కు విశేష స్పందన వచ్చిందని, వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు తోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని పేర్కొంది. మొత్తం 455.14 టన్నుల ఘన వ్యర్థాలను తొలగించినట్టు వెల్లడించింది. ఇక, మార్చి 19-22 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.3500 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపింది. ఆధునిక సాగు విధానాలు, వ్యవసాయ యంత్రాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మూడు రోజులు పాటు రైతు మేళాలు నిర్వహించినట్టు పేర్కొంది. అలాగే, కొత్వాలగూడలో ఎకో హిల్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... బుద్వేల్ లేఅవుట్‌కు రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు శంకుస్థాపన చేశారని వెల్లడించింది. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారని తెలిపింది. అలాగే, పలు నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులు, 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రులు, ఎన్సాన్‌పల్లిలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్, నంగునూరులో పీహెచ్‌సీ భవనం, సిద్దిపేటలో యూపీహెచ్‌సీ భవనం, రూ. 200 కోట్లతో గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపనలు చేశారని ప్రభుత్వం వెల్లడించింది. మర్కూక్, జగదేవ్ పూర్ లో సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను కూడా ప్రారంభించారని తెలియజేసింది. ఇక, వ్యాధుల వ్యాప్తి నియంత్రణ, పశు జనన నియంత్రణ, ఈ-వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఫ్రైడే... డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించింది. అలాగే, పారిశుధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు ‘‘హ్యాపీ సండే’’ కార్యక్రమం నిర్వహించామని పేర్కొంది. కాగా, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నాటికి అన్ని జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్థి పనులకు శంకుస్థాపనలు చేయాలని, ఇప్పటికే పూర్తయినవి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్-కమిటీ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. 99 రోజుల కార్యాచరణ పర్యవేక్షణకు సీఎస్ రామకృష్ఱారావు ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపొందించారు. మంత్రులందరూ తమ జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.