Share News

కోరినన్ని నిధులు ఇవ్వలేం

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:10 AM

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌లో మంజీరా ఉప నది లెండిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిందని...

కోరినన్ని నిధులు ఇవ్వలేం

  • లెండి ప్రాజెక్టుపై మహారాష్ట్రకు తేల్చిచెప్పిన తెలంగాణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌లో మంజీరా ఉప నది లెండిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిందని, కోరిన వెంటనే చెల్లింపులు చేయలేమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రతి కాంపోనెంట్‌, ప్యాకేజీని నిశితంగా పరిశీలించాకా... వాస్తవిక అంచనా వ్యయం ఎంత, సవరించిన తర్వాత ఎంత, పెరుగుదలకు కారణాలేంటి తదితర అంశాలు తేలాకే నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మంగళవారం జలసౌధలో లెండి ప్రాజెక్టుపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో కూడిన అంతరాష్ట్ర బోర్డు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సవరించిన నిర్మాణ అంచనా వ్యయం ప్రకారం సత్వరం చెల్లింపులు చేస్తేనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని మహారాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్‌ పేర్కొన్నారు. తెలంగాణ వాటా రూ.473.59 కోట్లు కాగా ఇప్పటిదాకా రూ.189.73 కోట్లు చెల్లించారని, మరో రూ.283.86 కోట్లు చెల్లించాలని చెప్పారు. అంచనా వ్యయం అనూహ్యంగా పెరిగిందని, కోరిన వెంటనే చెల్లింపులు చేయలేమని తెలంగాణ ఈఎన్‌సీ (జనరల్‌) ఓలేటి వెంకట రమే్‌షబాబు స్పష్టం చేశారు. తమ అధికారులు లెండి ప్రాజెక్టును సందర్శించి మహారాష్ట్ర వాదనలో వాస్తవికత ఉందా, లేదా అనేది పరిశీలిస్తారని తెలిపారు. సమన్వయ కమిటీ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి.. అదీ లెండి ప్రాజెక్టు వద్దే జరగాలన్నారు. 1985లో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. పూర్వ నిజామాబాద్‌ జిల్లాలో 22 వేల ఎకరాలకు, మహారాష్ట్రలో 27 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాలనేది లక్ష్యం. 1984-85లో తెలంగాణ కెనాల్‌ నిర్మాణ అంచనా వ్యయం రూ.9.04 కోట్లు కాగా 2017-18లో ఏకంగా రూ.150.76 కోట్లకు చేరింది. సకాలంలో భూసేకరణ పూర్తికాకపోవడం వల్లే అంచనా వ్యయం భారీగా పెరిగిందని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Feb 11 , 2026 | 02:10 AM