Chief Minister Revanth Reddy: భూములు సేకరించాకే ప్రాజెక్టులు!
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:01 AM
ఇక మీదట ఏ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా తొలుత భూసేకరణ జరపాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకుండానే ప్రాజెక్టులను చేపడితే అవి తొందరగా పూర్తిగాక, నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయని..
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
ప్రస్తుతం ‘నారాయణపేట-కొడంగల్’ ఎత్తిపోతలలో ఇదే ఫార్ములా అమలు
సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణే అడ్డంకి
భారీగా పెరిగిన భూముల విలువలు, అరకొర పరిహారమే కారణం
ప్రాజెక్టుల పూర్తికి 40వేల ఎకరాలు అవసరం
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇక మీదట ఏ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టాలన్నా తొలుత భూసేకరణ జరపాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకుండానే ప్రాజెక్టులను చేపడితే అవి తొందరగా పూర్తిగాక, నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయని.. దీంతో ఇకపై ఏ ప్రాజెక్టును ప్రతిపాదించినా.. తొలుత భూములు సేకరించాల్సిందేనని సీఎం నిర్దేశించారు. కన్నెపల్లి వద్ద ప్రాణహితపై నిర్మించదలచిన చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం.. పదేళ్లుగా భూసేకరణలో జాప్యం కారణంగా భారీగా పెరిగింది. మంగళవారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్ష చేస్తూ.. ప్రాజెక్టు కోసం పదేళ్లుగా ఎందుకు భూసేకరణ చేయలేదని అధికారుల్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగానే.. ఇకముందు ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా తొలుత భూసేకరణ పూర్తి చేయాల్సిందేనని నిర్దేశించారు. చిన్నకాళేశ్వరం భూసేకరణ కోసం తక్షణం రూ.189 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా, తొలుత భూసేకరణ జరపాలన్న ఫార్మూలాను ప్రస్తుతం ‘మక్తల్-నారాయణపేట-కొడంగల్’ ఎత్తిపోతల పథకంలో అమలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా... గత ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు పక్కనపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత 7 టీఎంసీల సామర్థ్యంతో, మూడు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు 562 ఎకరాల భూమి అవసరమని గుర్తించి, తొలుత భూమిని సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం 560.28 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇప్పటికే 195 ఎకరాలు సేకరించారు.
కనాకష్టంగా భూసేకరణ
రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు భూసేకరణ కనాకష్టంగా మారింది. భూముల విలువలు అమాంతంగా పెరిగిపోవడం, గత ప్రభుత్వమే రెండు దఫాలుగా భూముల మార్కెట్ విలువలు సవరించడం, రాష్ట్రంలో ఏ మూలన చూసుకున్నా ఎకరా భూమి సగటున రూ.15 లక్షల వరకు ఉండటం, ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారానికి భూముల అప్పగింతకు యజమానులు ముందుకు రాకపోవటం తదితర కారణాలు భూసేకరణ ఇబ్బందికరంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటరీలు కట్టినంత వేగంగా.. డిస్ట్రిబ్యూటరీలపై (మైనర్‌లు, సబ్ మైనర్లపై) గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. సిద్దిపేట జిల్లాలో మాత్రమే డిస్ట్రిబ్యూటరీల పనులు జరిగాయి. దీనివల్ల ఆ జిల్లాలో 98 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు పూర్తికావాలంటే 40 వేల ఎకరాల భూమి అవసరం.
ప్రధాన ప్రాజెక్టుల భూ సేకరణ
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 22 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. 19,432 ఎకరాలు సేకరించారు. మరో 2,655 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజె క్టును 4.51 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా 2003 మే 14న రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టగా... ప్రస్తుతం అంచనా వ్యయం రూ.6 వేల కోట్లు దాటింది. 3.32 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. మరో 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే 2,655 ఎకరాలు సేకరించాలి.
జవహర్ నెట్టెంపాడును 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి రూ.1428 కోట్లతో చేపట్టగా... ప్రస్తుతం దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.2754 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కోసం మరో 611 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ఆరు జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. 27,047 ఎకరాలకు గాను 26 వేల ఎకరాలు సేకరించారు. ఇది కూడా హెడ్‌వర్ ్కలకే. డిస్ట్రిబ్యూటరీల కోసం భూములు సేకరిస్తేనే 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంటుంది.
సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు 411 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూమి ఇవ్వడానికి రైతులెవరూ ముందుకు రాకపోవడంతో భూసేకరణ ఆగింది.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు 22,283 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా... 19,432 ఎకరాలు సేకరించారు. మరో 2,851 ఎకరాల భూమి అవసరం.
దేవాదుల ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. 33 వేల ఎకరాలకు గాను 30 వేల ఎకరాలు సేకరించారు.