లాభాలు మీకు.. నష్టాలు మాకా?
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:58 AM
‘మాకొచ్చే మార్జిన్‌ను తగ్గించి.. మీరు మాత్రం లాభాలు తీసుకుంటారా? 20 ఏళ్లుగా మాకు ఒక్క రూపాయి పెంచకపోగా.. మా కొచ్చే లాభం నుంచి రూ.10 తగ్గిస్తారా?
పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంపై చికెన్ షాప్ యజమానుల అసోసియేషన్ ఆగ్రహం
1 నుంచి చికెన్ షాపుల బంద్ పాటిస్తామని వెల్లడి
మల్కాజిగిరి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘మాకొచ్చే మార్జిన్‌ను తగ్గించి.. మీరు మాత్రం లాభాలు తీసుకుంటారా? 20 ఏళ్లుగా మాకు ఒక్క రూపాయి పెంచకపోగా.. మా కొచ్చే లాభం నుంచి రూ.10 తగ్గిస్తారా? మీ గుత్తాధిపత్య ధోరణితో నష్టాల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది’ అని చికెన్ షాప్ యజమానుల అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. పౌల్ర్టీ రంగంలోని కార్పొరేటర్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తమ కమీషన్‌ను యథాతథంగా ఇచ్చేలా చూడాలని కోరారు. మల్కాజిగిరిలో చికెన్ షాప్ యజమానుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడారు. కిలో చికెన్‌పై తమకు రూ.26 మార్జిన్ ఉండేదని, ఆరు నెలలుగా దాన్ని రూ.16కు తగ్గించారని వాపోయారు. తాము బంద్ పాటిస్తామని హెచ్చరించడంతో ఓ కార్పొరేట్ సంస్థ కిలో చికెన్‌పై ఒకేసారి రూ.80 తగ్గించిందని, ఒకే సారి అంత మొత్తం ఎలా తగ్గించగలిగారని నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించాలని కోరారు. రెండు రోజుల్లోగా తమ సమస్యను పరిష్కరించకుంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటిస్తామని హెచ్చరించారు.