Share News

చికెన్‌ రికార్డ్‌.. కిలో ధర రూ 350, 370

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:16 AM

రాష్ట్రంలో చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో కిలో చికెన్‌ ధర రూ.350-370కు చేరింది. చికెన్‌ ధర ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటి సారి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

చికెన్‌ రికార్డ్‌.. కిలో ధర రూ 350, 370

  • ఒక్క వారంలోనే రూ.45 దాకా పెరిగిన ధర

  • నిజామాబాద్‌లో రూ.400కు చేరిన వైనం

  • పెళ్లిళ్లు, పండుగలతో చికెన్‌కు భారీ డిమాండ్‌

  • కోళ్లు బరువు పెరగకపోవడంతో తగ్గిన సరఫరా

  • ఎగుమతుల్లేక తగ్గిన గుడ్డు ధర.. డజను రూ.60

హైదరాబాద్‌/సిటీ/సుభాష్‌నగర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో కిలో చికెన్‌ ధర రూ.350-370కు చేరింది. చికెన్‌ ధర ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటి సారి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఆదివారం(15వ తేదీన) కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ ధర రూ.325 ఉండగా.. ఇప్పుడు రూ.370కి చేరింది. అంటే.. వారంలోనే రూ.45 వరకు పెరిగింది. విత్‌ స్కిన్‌ చికెన్‌ (డ్రెస్డ్‌ చికెన్‌) కిలో రూ.320 పలకగా, లైవ్‌ చికెన్‌ రూ.210-220 మధ్య విక్రయించారు. నిజామాబాద్‌లో ఏకంగా కిలో ధర రూ. 400 పలికింది. ఇక బోన్‌లెస్ చికెన్‌ కిలో రూ.700పైనే చెబుతున్నారు. వాస్తవానికి కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన చికెన్‌ ధరలు... ఇటీవల మరింత వేగంగా పెరిగాయి. పంచాయతీ ఎన్నికలు, సమ్మక్క-సారక్క జాతర, ఆ తర్వాత మునిసిపాలిటీ ఎన్నికల ప్రభావానికి తోడు పెళ్లిళ్ల సీజన్‌, రంజాన్‌ పండుగ నేపథ్యంలో చికెన్‌‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సరఫరా తగ్గిపోవడంతో కిలో రూ.250గా ఉన్న ధర.. పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రోజులుగా వాతావరణ అసమతుల్యత వల్ల కూడా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. ఫామ్‌ల వద్దే కాకుండా, షాపులకు చేరిన తర్వాత కూడా కోళ్లు మరణిస్తుండటం పరిస్థితిని క్లిష్టంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా కోడి పిల్లలను తెచ్చి పెంచుదామనుకునే రైతులు కూడా వెనుకడుగు వేస్తున్నారు.


కొన్ని వారాల క్రితం వరకు హైదరాబాద్‌ సమీప ప్రాంతాల నుంచే సరఫరా జరిగేదని, ఇప్పుడు సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ వంటి దూర ప్రాంతాల నుంచి కోళ్లు తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చికెన్‌ షాపుల యజమానులు చెబుతున్నారు. మరోవైపు, ఈ కొరతను ఆసరాగా చేసుకుని ప్రముఖ సంస్థలు పరస్పరం కుమ్మక్కై షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికెన్‌ ధర పెరగడంతో చాలా మంది కొనుగోలు తగ్గించారు. గతంలో కిలో తీసుకునే వారు ఇప్పుడు 500-750 గ్రాములే తీసుకుంటున్నారు. ధరలు పెరగడంతో అమ్మకాలు 30-40 శాతం తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక, నాటు కోడి ధరలైతే మరింత భారంగా మారాయి. గతంలో నాటు కోడి లైవ్‌ బర్డ్‌ కిలో రూ.400 ఉండగా, ఇప్పుడు రూ.500కు చేరింది. కాగా, తెలంగాణలో ప్రతి రోజు 11 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతాయని తెలంగాణ ఫౌల్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తెలిపారు. ఉదయం ఎండ.. రాత్రిపూట చలి ఉండడంతో వాతావరణ హెచ్చుతగ్గులకు కోళ్లు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. సాధారణంగా ఇంతకు ముందు ఒక కోడి రెండున్నర నుంచి మూడున్నర కిలోల వరకు బరువు వచ్చేదని, ఇప్పుడు వేసవి ప్రభావం వల్ల కిలోన్నర మాత్రమే ఉంటుందని, బరువు తగ్గడంతో ఆ ప్రభావం ధరపై పడుతోందని వివరించారు. కాగా, చికెన్‌ ధర పెరుగుతుండగా.. కోడిగుడ్ల ధర మాత్రం పడిపోయింది. నెల క్రితం వరకు గుడ్ల కొరత ఉండడంతో ఒక్క గుడ్డు ధర రూ.8కి చేరింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, ముఖ్యంగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా ఎగుమతులు తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్‌లోనే గుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. సప్లై పెరిగి డిమాండ్‌ తగ్గడంతో వాటి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం గుడ్డు ధరను రిటైల్‌గా రూ.4.50 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. డజను గుడ్లు రూ.60 దాకా అమ్ముతున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:55 AM