చనిపోయినా చేయూత పింఛన్లు!
ABN , Publish Date - May 01 , 2026 | 05:51 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ప్రవేశపెట్టేందుకు మెదక్..
మృతుల ఖాతాల్లో జమవుతున్న వైనం
పైలట్ సర్వేతో అక్రమాలు వెలుగులోకి..
మెదక్‌లో 4 వార్డుల్లోనే 39 మంది మృతుల వివరాలు లభ్యం
ఇకపై ప్రతి 3 నెలలకోసారి ‘ఫేస్ రికగ్నిషన్’
మెదక్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ప్రవేశపెట్టేందుకు మెదక్ మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో (19 నుంచి 22) గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహించిన పైలట్ సర్వేలో సంచలన అంశాలు బయటపడ్డాయి. ఈ వార్డుల్లో మొత్తం 582 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో 39మంది మరణించినప్పటికీ వారి ఖాతాల్లో పెన్షన్ జమవుతోందని సర్వేలో గుర్తించారు. మరో 69 మంది చిరునామాలు లభ్యం కాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వీరు నిజంగా ఉన్నారా లేక కేవలం కాగితాలపై ఉన్న పేర్లా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల ఖాతాల్లో ఎంతకాలంగా పెన్షన్ జమవుతోందనే సమాచారం బయటకు రావడం లేదు. సర్వే చేసిన సెర్ప్ రాష్ట్రస్థాయి అధికారులు తమకు ఏ విషయాలూ బహిర్గతపర్చలేదని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం చేయూత పథకంలో వృద్ధులకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016 పెన్షన్ ఇస్తోంది. గ్రామాల్లో వృద్ధాప్య పెన్షనర్లకు సాయపడడానికి గ్రామ కార్యదర్శి థంబ్ వినియోగించుకునే వెసులుబాటు కల్పించారని తెలుస్తోంది. పెన్షనర్ల ఏటీఎం కార్డు ద్వారా వారి సంబధీకులు డబ్బులు డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల్లో మృతుల పేర్లను తొలగించకపోవడం, వారి బ్యాంక్ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం ద్వారా పెద్దఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ఫేస్ రికగ్నిషన్‌తో లబ్ధిదారులను గుర్తించనున్నారని తెలుస్తోంది.