‘సెన్సెస్’ పేరిట సెన్స్‌లెస్ ఆర్డర్లు!
ABN , Publish Date - May 21 , 2026 | 03:05 AM
జనగణన ప్రక్రియను అడ్డంపెట్టుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
బదిలీ తప్పించుకునేందుకు కొందరు ఉద్యోగుల ఎత్తుగడ
‘ఖర్చు’ చేసైనా జనగణన విధుల ఆర్డర్ల కోసం యత్నం
మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లో పైరవీలు
గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులకు బదిలీల్లో అన్యాయం
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): జనగణన ప్రక్రియను అడ్డంపెట్టుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. కీలకమైన, నగర ప్రాంతాల్లో అడ్డా వేసిన సదరు ఉద్యోగులు.. కాస్త ఖర్చుపెట్టి అయినా జనగణన విధుల్లో ఉన్నట్టుగా ఆదేశాలను సంపాదిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాటిని చూపుతూ తమకు సాధారణ బదిలీలు వర్తించవని, బదిలీల ప్రక్రియలో చేర్చవద్దని కోరుతూ శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నట్టు సమాచారం.
పెద్ద ఉద్యోగులూ ఇదే బాటలో..
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ మొదలైంది. అయితే గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు.. తాము గ్రామీణ ప్రాంతాలకు, లేదా వేరే జిల్లాలకు బదిలీకాకుండా ఉన్నచోటే కొనసాగేందుకు ప్రయత్నా లు ప్రారంభించారు. ప్రభుత్వం ఏప్రిల్ 21న జారీ చేసిన ఆదేశాల్లోని.. జనగణన ప్రక్రియలో పాలుపంచుకునే ఉద్యోగులు, సిబ్బందికి సాధారణ బదిలీల నుంచి ఇచ్చిన మినహాయింపును అక్రమంగా వాడుకోవడానికి సిద్ధమయ్యారు. నగర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల్లో కలెక్టర్లకు మాత్రమే జనగణన విధుల ఆర్డర్లు ఇచ్చే అధికారం ఉంది. ఈ క్రమంలో సదరు ఉద్యోగులు పైరవీలతో, ముడుపులు ముట్టజెప్పి ఆయా కార్యాలయాల నుంచి జనగణన ఆర్డర్లు పొందుతున్నారని.. జనగణన ప్రక్రియకు వెళ్లనివారు, వెళ్లేందుకు అవకాశం లేని హోదా ఉన్నవారు కూడా ఇందులో ఉన్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఏదైనా విభాగంలో, సంస్థలో హెచ్‌వోడీగా, కార్యాలయంలో అధిపతిగా ఉన్నవారికి జనగణన విధులు అప్పగించబోరని.. కానీ అలాంటివారూ ఆర్డర్లు సంపాదించి, బదిలీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దీనితో చాలా కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు.. పట్టణ ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తమవుతోంది.
సిబ్బంది ‘లెక్క’ ముందే పూర్తయినా..
రాష్ట్రంలో జనగణనపై ఈ ఏడాది జనవరి 22నే ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆ ప్రక్రియకు అవసరమైన సిబ్బందిని వివిధ శాఖల వారీగా గుర్తించి, కేటాయించింది. వారందరికీ మార్చి, ఏప్రిల్ నెలల్లో విడతల వారీగా జనగణనపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియకూడా మొదలైంది. ఇలాంటి సమయంలో కొత్తగా జనగణన విధుల ఆర్డర్లు తెచ్చుకుని, తమను బదిలీ చేయవద్దని తమ శాఖలోని ఉన్నతాధికారులకు లేఖలు రాస్తుండటం కలకలం రేపుతోంది. ఒక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో అధికారి తనకు సెన్సస్ డ్యూటీ పడిందని.. తాను ప్రిన్సిపల్ విధుల నుంచి రిలీవై, జనగణన పనిలో ఉన్నానని చెబుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 21 తర్వాత జనగణన విధుల్లో ఉన్నట్టు తీసుకువచ్చిన ఆర్డర్లపై, క్షేత్రస్థాయిలో నిజంగా అవసరం ఉందా, లేదా అనే దానిపై విచారణ చేయిస్తే ఈ వ్యవహారమంతా బయటపడుతుందని ఉద్యోగులు అంటున్నారు.