జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబివ్వాల్సిందే
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:39 AM
వచ్చే ఏడాది ప్రారంభమయ్యే జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ప్రశ్నలు అడిగే అధికారం ఎన్యుమరేటర్లకు ఉంటుంది
సమాధానాలు ఇవ్వడానికి నిరాకరిస్తే వెయ్యి జరిమానా
తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే మూడేళ్ల జైలుశిక్ష
ఎన్యుమరేటర్లు విధులు తిరస్కరించినా.. ఇతరులకు ఆటంకాలు కలిగించినా అదే జరిమానా, జైలుశిక్ష
రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ.. మార్గదర్శకాల జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది ప్రారంభమయ్యే జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జనగణన అధికారికి ప్రశ్నలడిగే అధికారం ఉంటుందని, ప్రతి వ్యక్తీ నిబంధనలకు కట్టుబడి జవాబులు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జనగణన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను సంబంధిత శాఖల విభాగాధిపతులకు ప్రభుత్వం పంపించింది. వీటిపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని ఆదేశించింది. సంప్రదాయాలు, ఆచారాలు, మత ధర్మాల ప్రకారం.. తమ భర్తల పేర్లు చెప్పకూడదంటూ మహిళలు సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించడం కుదరని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవడానికి, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల వార్డులు, డివిజన్ల విభజనకు ఈ జనగణన వివరాలే ఆధారమవుతాయని తెలిపింది. అందుకే ప్రజలు తప్పుడు సమాచారం ఇవ్వకుండా.. తమకు తెలిసిన పక్కా సమాచారాన్ని అందించాలని సూచించింది. ఎన్యుమరేటర్లను ఇళ్ల వరకు రానివ్వాలని, భవిష్యత్తులో అవసరమైతే ఆ ఇళ్లకు ఏవైనా లేఖలను అతికించడానికి వీలుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే.. అప్పగించిన విధులను ఎన్యుమరేటర్లు తిరస్కరించినా, ఇతరుల విధులకు ఆటంకం కలిగించినా రూ.1000 వరకు జరిమానా విధించ నున్నట్లు తెలిపింది. ‘సెన్సెస్ చట్టం-1948’లోని పార్ట్(ఎ) కింద నేరం నిరూపణ అయితే.. మూడేళ్ల పాటు జైలుశిక్ష ఉంటుందని పేర్కొంది. ఎన్యుమరేటర్లకే కాకుండా.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చిన లేదా వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రజలకు కూడా అంతే జరిమానా, జైలుశిక్ష ఉంటాయని వివరించింది.