Share News

రాష్ట్ర సగటుకన్నా మెరుగ్గా ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:33 AM

రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదిక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

రాష్ట్ర సగటుకన్నా మెరుగ్గా ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు

  • బీసీ-సీ, బీ కేటగిరీల్లోని ఈ కులాలు రాష్ట్ర వెనుకబాటు సగటుకన్నా బెటర్‌

  • తక్కువ వెనుకబాటుతనంలో బీసీ వర్గాలు.. కొన్ని వర్గాలైతే

  • సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో

  • 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు..

  • తెలంగాణలోని 242 కులాలపై కులగణన నివేదిక

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదిక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల మధ్య వెనకబాటు తనంలో గణనీయమైన తేడాలున్నట్లు ‘సీబీఐ’ (క్యాస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ నెస్‌ ఇండెక్స్‌) నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఓసీ కేటగిరీలో ఉన్న రెడ్లు, కాపులు, వెలమలు, కమ్మలు, రాజులు, జైనులు, అయ్యంగార్లు, బ్రాహ్మణులు, కోమట్లు తక్కువ వెనకబడిన కులాల జాబితాలో ఉన్నారు. భూమి, విద్య, ఉపాధిరంగాల్లో మెరుగైన అవకాశం రావటంతో ఈ వర్గాలు తక్కువ వెనకబాటుతో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. అత్యంత వెనకబడిన కులాలు, తక్కువ వెనుకబాటు కలిగిన కులాల మధ్య సూచీ స్కోరులో 100 పాయింట్ల తేడా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సగటు స్కోరు 81 కాగా... తక్కువ వెనకబడిన కులాలు సుమారు 60 పాయింట్లు తక్కువగా ఉన్నాయి. అత్యంత వెనకబడిన కులాలు కనీసం 30 పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... బీసీ వర్గాలు తక్కువ వెనకబాటుతనంలో ఉన్నాయి. ముఖ్యంగా బీసీ-సీ కేటగిరీలో ఉన్న ఎస్సీ క్రైస్తవులు, బీసీ- బీలోని కంసాలీలు రాష్ట్ర సగటు కంటే మెరుగైన స్థాయిలో ఉన్నట్లు సీబీఐ నివేదిక వెల్లడించింది. ఈ లెక్క ప్రకారం బీసీ వర్గాలు సమానంగా వెనకబడలేదని, కొన్నివర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలకు సమానస్థాయిలో అభివృద్ధి చెందాయని ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కాగా ఈ అధ్యయనం కేవలం 56 కులాలకు మాత్రమే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని మొత్తం 242 కులాలపై నిర్వహించింది. నో క్యాస్ట్‌, ఇతర వర్గాలను కూడా ఇందులో చేర్చారు. సుమారు 3.55 కోట్ల మంది ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని కులగణన విశ్లేషణ చేపట్టినట్లు నివేదిక వెల్లడించింది.


నివాస ప్రాంతాలే జీవన స్థితిగతులకు సూచికలు

ప్రజల జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది. ఆదాయం, ఉపాధిరంగాల్లో మార్పులుండగా.. జీవన ప్రమాణాలు మాత్రం ప్రజల స్థిరమైన అభివృద్ధి స్థాయిని ప్రతిబింబిస్తాయని నివేదిక వెల్లడించింది. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, గృహ సౌకర్యాల లాంటి ప్రాథమిక అవసరాలతో వర్గాల మధ్య ఉన్న అసమానతలు స్పష్టంగా బయటపడుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలు, దూర ప్రాంతాల్లో నివసించేవారు అభివృద్ధికి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, రవాణా లాంటి కీలక సేవలు వీరికి అందటంలేదు. ఇళ్ల పరిమాణం, గదులసంఖ్య లాంటి అంశాలు కూడా వెనకబాటు తనాన్ని సూచిస్తున్నాయి. రెండు గదుల కంటే తక్కువున్న ఇళ్లలో నివసించే కుటుంబాలు తక్కువ జీవన ప్రమాణాలతో, మూడు లేదా అంతకంటే ఎక్కువ గదులున్న ఇళ్లలో నివసించేవారు ఎక్కువ జీవన ప్రమాణాలతో ఉన్నారు. మరుగుదొడ్ల వసతి లేకపోవటం... ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. మహిళలు, వృద్ధుల జీవనశైలికి అడ్డంకిగా మారుతోంది. విద్యుత్తు సౌకర్యం లేకపోవటంతో విద్య, ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంటింటికి పైపులైను ద్వారా శుభ్రమైన తాగునీరు అందుబాటులో లేకపోవటంతో మహిళలపై తాగునీటి సేకరణ భారం పెరుగుతోంది.

అగ్రవర్ణాలకు వసతులెక్కువ... వెనుబడిన వర్గాలకు తక్కువ

కులాల మధ్య జీవన పరిస్థితుల్లో కూడా తీవ్ర అసమానతలున్నట్లు సీబీఐ నివేదిక స్పష్టంచేసింది. ముఖ్యంగా అగ్రవర్ణాలకు చెందిన ఓసీలు కాపులు, బ్రాహ్మణులు, రాజుల లాంటివారు జీవన పరిస్థితుల్లో ముందంజలో ఉన్నారు. వీరికి గృహాలు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్తు, పైపులైన్‌ తాగునీరు లాంటి వసతులు అందుబాటులో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. చారిత్రకంగా విద్య, భూమి, ఉపాధిలో ఉన్న ఆధిక్యం ఇప్పుడు జీవన ప్రమాణాల్లో కూడా కనిపిస్తోంది. ఎస్సీ మాదిగలు, బేడ, ఎస్టీ కోలం, కోయ, గోండు వర్గాలు తీవ్ర వెనకబాటులో ఉన్నట్లు తేలింది. మౌలిక వసతుల కొరతతో వీరి జీవన ప్రమాణాలు దిగువ స్థాయిలో ఉన్నాయి. బీసీ వర్గాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ- సీ కేటగిరీలోని ఎస్సీ క్రైస్తవులు.. వెలమలు, కమ్మలు, కోమట్లు, రెడ్లతో సమానస్థాయిలో ఉన్నారు. బీసీ-డీ మాలి, ఒడ్డెర, ఎస్సీ మహార్లు, ఎస్సీ మాల సాలే వర్గాలు వెనకబాటుతనంలో కొనసాగుతున్నాయి.


అయ్యంగార్లలోనే కులాంతర వివాహాలు అధికం

రాష్ట్రంలో కులాంతర వివాహాలు అత్యధికంగా చేసుకుంటున్న సమాజికవర్గాల్లో అయ్యంగార్లు (అయ్యర్‌) మొదటి స్థానం(12 శాతం)లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీసీ- సీ వర్గంలోకి వచ్చే ఎస్సీ క్రిస్టియన్లు (9.9 శాతం) ఉన్నారు. ఓసీ కులాల్లో అయ్యర్ల తర్వాత అత్యధికంగా కులాంతర వివాహాలు చేసుకుంటున్నవారిలో రాజు, కాపు, బ్రాహ్మణ, ముస్లిం, కమ్మ, జైనులు ఉన్నారు. బీసీల్లో ఎస్సీ క్రిస్టియన్ల తర్వాత బీసీ-ఏ వర్గంలో భాగమైన గంగిరెద్దులవారు, అగ్నికుల క్షత్రియులు, జంగాల వారు అధికంగా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఎస్టీల్లోని కొలాము (2.6ు)ల్లో అతి తక్కువగా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి.

3.jpg

ప్రభుత్వ కొలువుల్లోనూ అయ్యంగార్లదే ఆధిపత్యం

రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులున్న కులాల్లో ఓసీల్లోని అయ్యంగార్ల (అయ్యర్‌)దే ఆధిపత్యం. అన్ని కులాల్లో కలిపి చూస్తే సగటున ఆరు శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అయ్యంగార్లలో 17 శాతం ఉన్నారు. వీరి తర్వాత ఎస్సీ క్రైస్తవులు (బీసీ-సీ) 7.4 శాతం ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జైనులు (ఓసీ), బ్రాహ్మణులు (ఓసీ) ఉన్నారు. బీసీల్లో బీసీ ఏ వర్గంలోని అగ్నికుల క్షత్రియులు, జంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా ఉన్నారు. ఎస్టీ కొలాముల్లో అతి తక్కువగా 0.6 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

2.jpg

మూడింట రెండొంతుల కుటుంబాలు ఒకటి, రెండు గదుల ఇళ్లలోనే నివాసం

రాష్ట్రంలో 63.5 శాతం అంటే మూడింట రెండొంతుల కుటుంబాలు ఒకటి లేదా రెండు గదుల ఇళ్లలోనే నివసిస్తున్నాయి. ఇందులో ఎస్టీ కొలాం కుటుంబాల పరిస్థితి మరీ దయనీయం. వారిలో 86 శాతం మంది ఇరుకు ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. వారి తర్వాత ఇక్కట్లు ఎదుర్కొంటున్నవారిలో ఎస్టీ గోండులు, కోయలు, మహర్లు, ఎస్సీ మాదిగలు ఉన్నారు. మరోవైపు ఈ విషయంలో బ్రాహ్మణులు మెరుగ్గా ఉన్నారు. వారిలో 32.6 శాతం మంది మాత్రమే ఒకటి లేదా రెండు గదుల ఇళ్లలో నివసిస్తున్నారు. ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువ. వీరి తర్వాత కోమట్లు, జైనులు, రాజులు, ఇతర ఓసీ కులాలు కూడా మెరుగైన స్థితిలో రాష్ట్ర సగటులోపే ఉన్నాయి.

1.jpg

31శాతం కుటుంబాల వార్షికాదాయం రూ.లక్షలోపే

రాష్ట్రంలోని 31 శాతం కుటుంబాల వార్షికాదాయం రూ.లక్షలోపే ఉందని సర్కారు తెలిపింది. బేడ, వడ్డె, ఎరుకల, ముదిరాజ్‌, మాదిగ కులాలవారి ఆదాయం అతితక్కువగా ఉండగా.. వెలమ, కమ్మ, రాజు, బ్రాహ్మణ, కాపు, వైశ్య కులాలవారిలో ఆదాయం ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూస్తే.. గ్రామాల్లో అత్యధిక శాతం కుటుంబాల వార్షికాదాయం రూ.లక్ష లోపే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ, బీసీ కులాల్లో చాలా వరకు అతితక్కువ ఆదాయ వర్గంలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో సగటు వార్షికాదాయం రూ.1.50 లక్షల వరకు ఉందని సర్కారు తెలిపింది. కొన్ని కులాల్లో మాత్రం రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నట్టు వెల్లడించింది.

Updated Date - Apr 16 , 2026 | 04:33 AM