క్యాన్సర్ చికిత్స వికేంద్రీకరణ
ABN , Publish Date - May 17 , 2026 | 05:35 AM
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సను వికేంద్రీకరించి బాధితులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ప్రతీ 100 కిలోమీటర్లకు ఒక కేంద్రం .. కేసుల నమోదు.. సమగ్ర గణాంకాలు
పిల్లలకు ప్రత్యేకంగా ఒక ఆస్పత్రి
ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్
క్యాన్సర్ సెంటరాఫ్ ఎక్సలెన్స్‌గా నిమ్స్, ఎంఎన్‌జే ఆస్పత్రుల అభివృద్ధి
‘రాష్ట్ర క్యాన్సర్ అట్లా్‌స’లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సిఫారసులు
2020-25 మధ్య కేసుల విశ్లేషణ
మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రతి నెలా సగటున 50 కొత్త క్యాన్సర్ కేసులు
కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం అధ్యయనాలు జరిపించాలని సూచన
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సను వికేంద్రీకరించి బాధితులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలసి ‘క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ’ను అందజేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ క్యాన్సర్ సలహాదారుడిగా ఉన్న దత్తాత్రేయుడు.. 2020-25 మధ్య కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదైన క్యాన్సర్ కేసుల గణాంకాలను విశ్లేషించి ఈ అట్లా్‌సను రూపొందించారు. క్యాన్సర్ బాధితులకు అందుతున్న చికిత్సకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దీంట్లో పేర్కొన్నారు. చికిత్స అన్నిచోట్లా అందుబాటులో లేదని, రోగులు కేవలం నాలుగైదు ఆస్పత్రులకే వెళ్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి మారాలని, 2030 నాటికి రాష్ట్రంలో ప్రతీ వంద కిలోమీటర్ల పరిఽధిలో పౌరులకు ప్రాథమిక క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులెవరూ క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదన్నారు. క్యాన్సర్ కేసులను విశ్లేషిస్తూ.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రతి నెలా సగటున 50 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీనికి కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ మేరకు అధ్యయనాలు జరిపించాలి. అలాగే ఏయే ప్రాంతాల్లో ఎటువంటి క్యాన్సర్ కేసులు ఉంటున్నాయి? ఏయే వయసుల వారిలో బయటపడుతున్నాయి? కనిష్ఠంగా ఎంత తక్కువ వయస్సులో కేసులు నమోదు అవుతున్నాయి? వంటి గణాంకాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే.. ఆ సమాచారం ఆధారంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. క్యాన్సర్ కేసుల సంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాల్లో స్ర్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి’ అని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సూచించారు.
రాష్ట్రంలో ప్రతీ లక్షకు సగటున 60-70 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రధానంగా క్యాన్సర్ కేసుల డేటా ప్రాముఖ్యత, చికిత్స అంశాలను క్యాన్సర్ అట్లా్‌సలో ప్రముఖంగా ప్రస్తావించారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించాలని డాక్టర్ దత్తాత్రేయుడు చేసిన సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆమోదిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల ఆ వ్యాధికి సంబంధించి కచ్చితమైన సమాచారం లభిస్తుందని, సమగ్ర డేటా అందుబాటులోకి వస్తుందని క్యాన్సర్ అట్లా్‌సలో డాక్టర్ దత్తాత్రేయుడు ప్రస్తావించారు.
అట్లాస్‌తో విధానపరమైన నిర్ణయాలు
రాష్ట్రంలో 2020-25 మధ్య కాలంలో ఆరోగ్యశ్రీలో నమోదైన క్యాన్సర్ కేసుల వివరాల ఆధారంగా క్యాన్సర్ అట్లాస్‌ను రూపొందించాం. ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ వివరాలు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాన్సర్ చికిత్సను మరింతగా మెరుగుపరచాలనే అంకితభావంతో ఉన్నారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తించడంతో డేటా నిరంతరం అప్‌డేట్ అవుతుంది. క్యాన్సర్ ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఎక్కువగా స్ర్కీనింగ్ చేయడంతో పాటు ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి.
- డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ఇతర సిఫారసులు
ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులు, విడిగా నమోదయ్యే కేసులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, జీహెచ్‌ఎంసీ డేటా ఆధారంగా క్యాన్సర్ కేసుల గణాంకాలను రూపొందించాలి. దీనిద్వారా క్యాన్సర్ అట్లా్‌సను అభివృద్ధి చేయాలి.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పిల్లల కోసం క్యాన్సర్ ఆస్పత్రిని (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పిడియాట్రిక్ ఆంకాలజీ) ఏర్పాటు చేయాలి. (ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఇప్పటికే వంద పడకలతో పిల్లల క్యాన్సర్ చికిత్స విభాగం నడుస్తోంది)
33 ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ‘క్యాన్సర్ కేర్’ను అమలు చేయాలి.
క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించాలి. ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాను భాగస్వామ్యం చేయాలి. అవగాహనను పెంపొందించే బాధ్యతను నిమ్స్ లేదా ఎంఎన్‌జే అధ్యాపక సిబ్బంది తీసుకోవాలి.
నిమ్స్‌లో క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్ కోసం చైర్మన్‌ను నియమించాలి. ఆ ఆస్పత్రిలోని విభాగాధిపతుల్లోనే ఒకరిని ఆ పదవికి ఎంపిక చేయాలి.
నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులను చికిత్సకు సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేయాలి.
ఏయే ప్రాంతాల్లో ఏ తరహా క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో గుర్తించి ఆ తరహా చికిత్సకు వైద్యులను నియమించాలి.